
భవితకు ‘నవోదయం’
ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం
● రేపే దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ● డిసెంబర్ 13న ప్రవేశపరీక్ష
వర్గల్(గజ్వేల్): ఆశ్రమ వసతులు, క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యకు మారుపేరుగా నవోదయ విద్యాలయాలు నిలుస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ నవోదయలో 2026–27విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న ఎంట్రెన్స్ టెస్ట్ జరగనుంది. ఇందుకు విద్యార్థుల నుంచి ఈ నెల 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం 1987లో ఉమ్మడి జిల్లాలోని వర్గల్‌లో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసింది. ఆంగ్లం, తెలుగు, హిందీ త్రిభాషా సూత్రం ప్రాతిపదికన జాతీయ సమైక్యతకు బాటలు వేస్తున్నది. గ్రామీణ విద్యార్థుల ఉజ్వల భవితకు సోపానంగా నిలుస్తోంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు, బాల బాలికలకు వేర్వేరు డార్మెటరీలు, టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు క్వార్టర్లు వంటి వసతులు ఉన్నాయి. అంతర్గత సీసీరోడ్లు, స్ట్రీట్‌లైట్లు, ఆరోగ్యాన్ని పంచే హరిత సంపద, సుశిక్షితులైన అధ్యాపక గణం, స్మార్ట్ క్లాసులు, సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయం, ఆటలకు బాసటగా విశాలమైన స్టేడియం, బాస్కెట్‌బాల్ తదితర మైదానాలు, జిమ్, హెల్త్ సెంటర్‌లతో నవోదయ ప్రత్యేకతను చాటుతుంది. ఇక్కడ పుస్తకాలు, దుస్తులు సహా విద్యార్థులకు అన్నీ ఉచితమే. ఇక్కడ ఆరు, ఏడు తరగతులు మాతృభాషలో, ఎనిమిదో తరగతి నుంచి ఆంగ్లంలో విద్యాబోధన చేస్తారు.
27 వరకు దరఖాస్తుల స్వీకరణ
వర్గల్ నవోదయలో ప్రవేశానికి డిసెంబర్ 13న ఎంట్రెన్స్ పరీక్ష జరగనుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27వరకు ఆన్‌లైన్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నవోదయ.గవ్.ఇన్ ద్వారా దరఖాస్తులు అప్‌లోడ్ చేయవచ్చు. అర్హత పరీక్షలో ప్రతిభ ఆధారంగా నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు.
అభ్యర్థుల అర్హతలు
ప్రస్తుత విద్యా సంవత్సరం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ లేదా సర్కారు గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. వరుసగా 3,4,5 తరగతులు ఒకే పాఠశాలలో చదివి ఉండాలి. మే 1, 2014 – జూలై 31, 2016 మధ్య జన్మించి ఉండాలి.
సద్వినియోగం చేసుకోవాలి
2026–27 విద్యా సంవత్సరం ఆరో తరగతి ప్రవేశానికి డిసెంబర్ 13న ఎంట్రెన్స్ పరీక్ష జరగనుంది. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారాన్ని వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. వివరాలు పూరించి, హెచ్‌ఎం సంతకంతో ఆన్‌లైన్‌లో గడువులోగా అప్‌లోడ్ చేయాలి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– రాజేందర్, ప్రిన్సిపాల్, వర్గల్ నవోదయ

భవితకు ‘నవోదయం’

భవితకు ‘నవోదయం’