
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
తూప్రాన్: వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని కన్న తల్లి ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన 10 నెలల తర్వాత తూప్రాన్ పట్టణ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను డీఎస్పీ నరేందర్‌గౌడ్ తన కార్యాలయంలో వెల్లడించారు. పట్టణ పరిధిలోని ఆబోతుపల్లి గ్రామ శివారులో 2024 నవంబర్ 28న హల్దీవాగులో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించి, కేసు నమోదు చేశారు.
కేసు ఛేదింపు ఇలా..
మృతుడు మిస్సింగ్ కేసు ఎక్కడ నమోదు కాకపోవడంతో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి ఫొటోలను మండలం పరిధిలో అతికించారు. వాటిని గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. మండలంలోని వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ అహ్మద్ పాషా(25)గా గుర్తించారు. అయితే మృతుని తల్లి మహ్మద్ రహేనా తన కుమారుడు కనిపించడం లేదని ఇప్పటి వరకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. దీంతో పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు రహేనాకు సిద్దిపేట జిల్లా ములుగు మండలం మక్తా మైలారం గ్రామానికి చెందిన జహంగీర్‌తో వివాహం జరిగింది. అనారోగ్యంతో భర్త ఇరవై ఏళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి తన ఇష్టం వచ్చినట్లు అక్కడక్కడ గ్రామాల్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వీఆర్‌ఏ కందాల భిక్షపతి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఐదేళ్లుగా కాళ్లకల్ గ్రామంలో నివాసం ఉంటుంది. కొడుకు అహ్మద్ పాషా మద్యానికి బానిసై తల్లిని నిత్యం వేధిస్తున్నాడు. వివాహేతర సంబంధానికి కుమారుడు అడ్డు వస్తున్నాడని, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. ఈ క్రమంలోనే 2024 నవంబర్ 27న సాయంత్రం ప్రియుడితో కలిసి తల్లి రహేనా కుమారున్ని బైక్‌పై తూప్రాన్ పట్టణ పరిధిలోని ఆబోతుపల్లి గ్రామ శివారులోకి తీసుకువచ్చి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న కుమారుడి మెడకు తాడు, చున్నీతో బిగించి హత్య చేశారు. అనంతరం బైక్‌పై తీసుకెళ్లి సమీపంలోని హల్దీ వాగులో పడేశారు. ఎవరికి అనుమానం రాకుండా వెళ్లిపోయారు. కాని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టి నిందితురాలు తల్లి రహేనా, ఆమె ప్రియుడు భిక్షపతిలను అరెస్టు చేశారు. చాకచక్యంగా వ్యవహరించిన సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ శివానందం, ఐడీ పార్టీ పోలీసులు గోవర్ధన్, కృష్ణ, వెంకట్, నరేందర్, దుర్గేశ్, సురేశ్‌లను డీఎస్పీ అభినందించారు.
ప్రియుడితో కలిసి కొడుకును చంపిన తల్లి
10 నెలల తర్వాత కేసును ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ నరేందర్‌గౌడ్