
జవాన్‌ను వెతకడంలో చొరవ చూపాలి
కొమురవెల్లి(సిద్దిపేట): ఇటీవల మండలంలోని అయినాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అనిల్ పంజాబ్‌లో విధులు నిర్వహిస్తూ అదృశ్యమయ్యాడు. అతడిని వెతకడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జవాన్ కుటుంబ సభ్యులను నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశం కోసం కుటుంబాన్ని వదిలి విధులు నిర్వహిస్తున్న జవాన్ అదృశ్యమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించినా ఫలితం లేదన్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జవాన్ ఆచూకీ కనిపెట్టి కుటుంబానికి భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తాడూరి రవీందర్, తేలు ఇస్తారి, అత్తిని శారద తదితరులు పాల్గొన్నారు.