
కిశోర బాలికలకు వరం
పొదుపు సంఘాల్లో సభ్యత్వానికి కసరత్తు
సంగారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధికి, మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరిలో కొత్త సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా తోడ్పాటు చేసేందుకు కృషి చేస్తుంది. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ రకాల పథకాలను తీసుకువచ్చింది. అందులో భాగంగా 15 నుంచి 18 ఏళ్లు ఉన్న వారు కిశోర బాలికల సంఘం, 18 ఏళ్లు పైబడిన మహిళలు మహిళా సంఘం, 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఘం, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారిని దివ్యాంగుల సంఘంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
కిశోర బాలికలకు ఆరోగ్యంపై..
జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రభుత్వం అందించే చేయూతతో ఆర్థికంగా బలపడుతున్నాయి. లోన్లు తీసుకున్న వారు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వాటి ద్వారా వచ్చిన లాభంతో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. 15 సంవత్సరాలు నిండిన బాలికలకు కిశోర బాలికల సంఘంగా ఏర్పాటు చేసి వారికి రక్షణ విషయంలో తీసుకోవాల్సినటువంటి అంశాలపై చైతన్యం కల్పిస్తున్నారు. బాలికలకు స్వయం రక్షణ, హెల్త్, పొదుపు వంటి అంశాలపై, యుక్త వయసులో వచ్చే మార్పులు, ఆరోగ్య విషయాలను వివరిస్తున్నారు. వీరితోపాటు గ్రామంలోని దివ్యాంగులు, వృద్ధులకు గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసి సభ్యత్వం కల్పించి, ఆర్థిక ఎదుగుదలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
జిల్లాలో 695 సంఘాలు
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం లక్షా 95 వేల మంది మహిళలు సంఘం సభ్యులుగా ఉన్నారు. అందులో 695 గ్రామ సమాఖ్య సంఘాలు ఉన్నాయి. కిశోర బాలికలకు అవగాహన కోసం గ్రామీణాభివృద్ధి సంస్థ, మండల స్థాయి అధికారులకు జిల్లాలో రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలోని మహిళలు వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో శిక్షణనిచ్చి జీవనోపాధి కల్పించడానికి పలు అవకాశాలు కల్పించనున్నారు.
60 దాటితే వృద్ధులు.. వైకల్యం
ఉంటే దివ్యాంగుల సంఘం
వివరాలు సేకరిస్తున్న అధికారులు
జిల్లాలో అవగాహన కార్యక్రమాలు

కిశోర బాలికలకు వరం