
మైత్రి పరిశ్రమపై రైతుల ఆగ్రహం
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి పారిశ్రామిక వాడకు చెందిన మైత్రి డ్రగ్స్ పరిశ్రమ యథేచ్ఛగా రసాయన వ్యర్థ జలాలను పంట పొలాల్లోకి విడుదల చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రైతులంతా ఏకమై పరిశ్రమ ఎదుట ధర్నా చేపట్టారు. వర్షం మాటున పరిశ్రమ యాజమాన్యం రసాయనాలను విడుదల చేయడంతో పంట నాశనం అయిందని మండిపడ్డారు. అనంతరం రైతులు మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను విడుదల చేస్తున్నాయని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పీసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పరిశ్రమ వద్ద జలాల శాంపిల్స్ సేకరించారు. పరీక్షల అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు రైతులకు సూచించారు. పరిస్థితి మరలా పునరావృతమైతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు.