
యాదవ సైనిక విభాగం ఏర్పాటు చేయాలి
హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వం యాదవ సైనిక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత యాదవ మహాసభ నాయకులు డిమాండ్ చేశారు. రెజాంగ్‌లా రాజ్ కలశ యాత్ర పది రాష్ట్రాల ద్వారా ప్రయాణిస్తూ శుక్రవారం హుస్నాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా యాదవ సైనిక అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... 1962లో భారత, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధంలో మన దేశం తరపున 124 మంది యాదవ సైనికులు పాల్గొని వీరోచితంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ యుద్ధంలో 114 మంది యాదవ సైనికులు అమరులయ్యారని తెలిపారు. అమరవీరుల మట్టిని కలశంగా తయారు చేసి దేశ వ్యాప్తంగా వారి త్యాగాలను ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేస్తున్నామని వివరించారు. ఈ యాత్ర మిగితా రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ నవంబర్ 18న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ రాష్ట్ర బాధ్యులు శ్రీహరి యాదవ్, నియోజకవర్గ జేఏసీ కో ఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్, నాయకులు చందు, బైకని శ్రీనివాస్ యాదవ్, జక్కుల రమేశ్ తదితరులు ఉన్నారు.