కొలువుల సోపానం..గ్రంథాలయం
● నిరుద్యోగుల భవిష్యత్తుకుదిశానిర్దేశం ● జిల్లా గ్రంథాలయంలో70,000 పైగా పుస్తకాలు ● నిత్యం 100 నుంచి 150 మంది నిరుద్యోగులు సన్నద్ధం ● ఇటీవల పలు పోటీ పరీక్షల్లో15 మందిపైగా ఉద్యోగాలు
సంగారెడ్డి క్రైమ్: పోటీ పరీక్షలకు, ప్రభుత్వ కొలువు సాధించేందుకు దోహదం చేస్తోంది జిల్లా గ్రంథాలయం. జిల్లా లైబ్రరీలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఏటా పలు పరీక్షల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతోపాటు పాఠశాల విద్యార్థులకూ డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉండటంతో జిల్లాలో విజ్ఞానభాండాగారంగా వెలుగొందుతోంది. నిరుద్యోగ యువత పోటీ పరీక్షల కోసం రూ.లక్షలు వెచ్చించి ప్రైవేట్ కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సాధారణంగా ఈ గ్రంథాలయానికి అత్యధికంగా నిరుపేద, మధ్యతరగతికి చెందిన యువతే ఇక్కడకు వస్తోంది. అదేవిధంగా గ్రామీణ యువత కూడా ఇక్కడ వచ్చి పోటీపరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని వస్తున్న నిరుద్యోగ యువతకు సంగారెడ్డి జిల్లా లైబ్రరీలో అన్ని వసతులు కల్పిస్తున్నారు. సాధారణ రోజల్లో లైబ్రరీని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు చదువుకునేందుకు సంబంధిత అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా లైబ్రరీకి ప్రతీ శుక్రవారం, అదేవిధంగా ప్రభుత్వ సెలవురోజుల్లో ఈ గ్రంథాలయానికి సెలవు ఉండటంతో యువతీ యువకులు ఇబ్బంది పడుతున్నారు.
అవసరమైన పుస్తకాలు అందుబాటులో..
జిల్లా గ్రంథాలయంతోపాటు ప్రతీ మండల కేంద్రంలోని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా సంబంధిత పుస్తకాలను అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు డీఎస్సీ,గ్రూప్స్–1,2,3,4,బ్యాంకింగ్, ఎస్సై,కానిస్టేబుల్,పంచాయతీ ఆఫీసర్ పరీక్షలకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ ఇక్కడ చదువుకునేందుకు అవకాశం లభిస్తోంది. నిరుద్యోగుల అభ్యర్థులు తమ ప్రత్యేక పుస్తకాలతో చదువుకునే వీలు ఉండేందుకు లైబ్రరీ అధికారులు ప్రత్యేక గదులు సైతం అందుబాటులో ఉంచుతున్నారు.
విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ
గ్రంథాలయానికి పోటీ పరీక్షలతోపాటు పట్టణంలోని విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. వీరికి నచ్చిన పుస్తకాలు చదివి లైబ్రరీని సద్వినియోగం చేసుకుంటున్నారు. అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్‌లకు వీలుగా ఉచిత వైఫై, డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి. లైబ్రరీలో రామయాణ, మహభారతం వంటి పురాణ, ఇతిహాసాలు కూడా అందుబాటులో ఉంచారు. గ్రామీణ మహిళలు ఇక్కడికి వచ్చి చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతీరోజు లైబ్రరీల్లో దినపత్రికలు అందుబాటులో ఉంచుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు జిల్లా లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగులకు ఏమైనా కావాలని కోరితే తెప్పించేందుకు కృషి చేస్తాం. ఇటీవల జరిగిన పలు పోటీ పరీక్షల్లో 15 మందిపైగా అభ్యర్థులు జిల్లా లైబ్రరీలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
– శ్రీనివాస్,
జిల్లా లైబ్రరీ కార్యదర్శి


