చిరకాల స్వప్నం..తీరెను కష్టం
జహీరాబాద్: ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తి కావడంతో ఇక వాహనాలు రయ్...రయ్..మంటూ పరుగులు పెట్టనున్నాయి. జహీరాబాద్ పట్టణంతో అనుసంధానంగా ఉన్న జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్‌కల్ మండలాలతోపాటు సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రయాణికులకు ప్రయాణ కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. రూ.వంద కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఈనెల 23న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రారంభించేందుకు వీలుగా శిలాఫలకం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు అంచనా రూ.90కోట్లు కాగా, ఇందులో రూ.50 కోట్లు భూ సేకరణ కోసం కేటాయించారు. రూ.50 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు.
ఏడేళ్లకు మోక్షం
రైల్వే ఫ్లై ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన ఏడు సంవత్సరాలకు పూర్తి చేశారు. ప్రయాణికుల కష్టాలను దూరం చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో నిధులు మంజూరు చేసింది. బ్రిడ్జి నిర్మాణం పనులు 2018 ఆగస్టు 30న చేపట్టారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టి ఎట్టకేలకు పూర్తి చేశారు.
20 నుంచి 30 నిమిషాలు ఆగాల్సిందే
స్థానిక లెవెల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి నాందేడ్, పూర్ణ, షిర్డీ, పర్లీ, లాతూర్ ప్రాంతాలతోపాటు బెంగళూరు, తిరుపతి, కాకినాడ ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అంతేకాకుండా గూడ్స్ రైళ్లు సైతం ఎక్కువగా వచ్చి పోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేట్లు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. పట్టణ ప్రజలతోపాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలు వచ్చిన ప్రతీసారి రైల్వే గేటు వద్ద కనీసం 20 నుంచి 30 నిమిషాలపాటు ఆగాల్సి వస్తోంది. ఈ మార్గంలో నిత్యం 36 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి.
బ్రిడ్జిపై ఎల్‌ఈడీ లైట్ల వెలుగులు
రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలను బిగించారు. కిలో మీటరు పొడువునా బిగించిన లైట్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జితో పాటు కింది భాగంలో ఉన్న సర్వీసు రోడ్డుపై కూడా వెలుతురు ఉండేలా బిగించారు. బ్రిడ్జికిరువైపులా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి దిగువన మొగుడంపల్లి క్రాస్ రోడ్డు నుంచి బీదర్ క్రాస్ రోడ్డు వరకు నాలుగు వరుసల సీసీ రోడ్డు నిర్మించి విద్యుత్ దీపాలను బిగించారు.
రూ.వంద కోట్లతో
రైల్వే ఫ్లై ఓవర్ పనులు పూర్తి
23న ప్రారంభించనున్న సీఎం రేవంత్
తీరనున్న వాహనదారుల
వెయిటింగ్ కష్టాలు


