
చేపలు పట్టే అధికారం మాదంటే మాది
చిన్నశంకరంపేట(మెదక్): చెరువులో చేపలు పట్టే అధికారం తమదంటే తమదని గ్రామంలోని ఇరువర్గాలు చేపలు పట్టేందుకు సిద్ధం కావడంతో నార్సింగి మండలం వల్లూర్ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం నార్సింగి మండలం వల్లూర్ గ్రామంలోని ఊరు చెరువులో ముదిరాజ్‌లు చేపలు పట్టేందుకు సిద్ధం కాగా విషయం తెలుసుకున్న గ్రామంలోని ఇతర వర్గాల ప్రజలు తాము కూడా చేపలు పట్టుకుంటామని చెరువు వద్దకు చేరుకున్నారు. గ్రామంలోని చెరువులో చేపలు పట్టే అధికారం తమకే ఉంటుందని ముదిరాజ్‌లు, లేదు చెరువుపై గ్రామంలోని అందరికీ అధికారం ఉంటుందని మిగితా గ్రామ ప్రజల మధ్య వివాదం నెలకొంది. గతంలో ఇలానే జరిగితే కొందరిని పోలీసులు బైండోవర్ చేశారు. తాజాగా బుధవారం మరోసారి వివాదం నెలకొని ఉద్రిక్తతకు దారి తీసింది. రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీస్‌లు ఇరు వర్గాలను సముదాయించారు. గ్రామపంచాయతీ వద్దకు ఇరు వర్గాలను పిలిపించి చర్చించారు. ఇరు వర్గాలు కూడా తమకే హక్కులు ఉన్నాయని వాదనకు దిగడంతో 20 వరకు తమకు ఉన్న హక్కుల పత్రాలను పోలీస్‌లకు, రెవెన్యూ అధికారులకు అందించాలని సీఐ సూచించారు. అప్పటి వరకు ఎవరు చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లొద్దని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కరీం,మత్స శాఖ ఏడీ మల్లేశం, ఎఫ్‌డీఓ రామ్‌దాస్ పాల్గొన్నారు.
వల్లూర్‌లో చెరువు వద్ద ఇరువర్గాల పంచాయితీ
ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం