
రెండు బైక్‌లు ఢీ: ఒకరు మృతి
పాపన్నపేట(మెదక్): రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన పాపన్నపేట మండలం కుర్తివాడ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. కుర్తివాడ గ్రామానికి చెందిన కర్రెల శేఖర్(60) నిత్యం హనుమన్ ఆలయం వద్ద పరిసరాలు శుభ్రం చేస్తుంటాడు. ఆదివారం టీవీఎస్ మోపెడ్‌పై కుర్తివాడ నుంచి పాపన్నపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మిన్‌పూర్ గ్రామం నుంచి మెదక్ వైపు వెళ్తున్న బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శేఖర్‌కు, మరో బైక్‌పై ఉన్న కిష్టయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు. కిష్టయ్యను మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బైక్‌పై నుంచి పడి యువకుడు
చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కర్నాల్‌పల్లి శివారులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుడి బంధువుల కథనం మేరకు.. రామాయంపేట మండలం దంతపల్లి గ్రామానికి చెందిన కేసరి ప్రవీణ్ (25) గ్రామంలో వాటర్ మెన్‌గా పని చేస్తున్నాడు. బంధువులకు సంబంధించిన ఓ వేడుక కోసం కర్నాల్‌పల్లి ఎల్లమ్మ ఆలయం వద్దకు వచ్చాడు. బైక్‌పై చేగుంట వైపునకు వెళ్తున్న ప్రవీణ్ వాహనం అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.

రెండు బైక్‌లు ఢీ: ఒకరు మృతి