పలహారానికి ప్రభుత్వ భూములు
● పథకం ప్రకారం సర్కారు భూములకు ఎసరు ● కబ్జాదారులకు వంతపాడుతున్న అధికారులు ● అమీన్‌పూర్ మున్సిపల్ అధికారుల అవినీతి బాగోతాల కథలెన్నో
పటాన్ చెరు: అమీన్‌పూర్‌లో దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా సర్కారు భూమి ఉంది. ఆ భూమిని కాజేసేందుకు కొన్నేళ్లుగా కబ్జాకోరులు ఎత్తులు వేస్తూనే ఉన్నారు. రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిపోయిన వీరు తాజాగా అధికారులతో కలసి మరింత జోరుగా ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నారు. ఈ కొత్త నాటకానికి సూత్రధారులు పాత్ర ధారుల తోడై కోట్లాది రూపాయల అవినీతికి తెర లేపారు. పట్టా భూమిలోని ప్లాట్లకు అనుమతులు తీసుకుని సర్కారు భూముల్లో పాగా వేసే ఎత్తుకు అమీన్‌పూర్ మున్సిపల్ అధికారులు వంత పాడుతున్నారు.
కబ్జాకు గురైన సర్కార్ భూమి
సర్వే నంబర్ 993లో మున్సిపల్ అధికారులు అనుమతివ్వడంతో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. వెయ్యి గజాల భూమిలో మున్సిపల్ అనుమతులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఈ వ్యవహారంపై అమీన్‌పూర్ తాజా మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, తాజా మాజీ కౌన్సిలర్ రమేశ్ ఇటీవల వ్యవహారంపై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ప్రతీ చోటా ఇదే తీరు...
అమీన్‌పూర్ పట్టణంలో ఇది ఒకటే కాకుండా ప్రతీచోట ఈ పద్ధతిలోనే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. పట్టా భూముల్లోనే ప్లాట్లను చూపుతూ ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం తమకే సంబంధం లేదని అనుమతులిచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని టౌన్ ప్లానింగ్ అధికారులు వాదిస్తున్నారు. తమ కంప్యూటర్ సిస్టం ప్రకారం అనుమతికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనలు మేరకున్న వాటికే అనుమతులు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ దరఖాస్తుదారులు ఇచ్చే మామూళ్లకు తలవంచి మున్సిపల్ అధికారులు ఇష్టానుసారంగా అడ్డగోలు అనుమతులిస్తున్నారని స్థానిక తాజా మాజీ కౌన్సిలర్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
తోటలో ప్లాట్లు
సర్వే నంబర్ 1118లో ఇటీవల రెండు ఇళ్లకు అనుమతులిచ్చారు. వాస్తవానికి ఇది ఓ మామిడి తోట. ఆ తోటకు ఎలాంటి రోడ్డు లేదు. డ్రైనేజీ నిర్మించలేదు. లే అవుట్ వేయలేదు. ఆ భూమి కోర్టు పరిధిలో ఉందని ఇతర అనేక ఆరోపణలున్నాయి. కానీ అధికారులు మాత్రం అక్రమ పద్ధతిలో ప్లాట్లు వేసేందుకు అనుమతులు జారీ చేశారు.
నర్రెగూడెంలో..
అమీన్పూర్ పరిధిలోని నర్రెగూడెంలో ప్రభుత్వ భూమిలో నాలుగు ఇళ్లకు అనుమతులు జారీచేశారు. ఒక తాజా మాజీ బీఆర్‌ఎస్ కౌన్సిలర్ పైరవీ చేసి అనుమతులను పొందారు. అలాగే 1056 సర్వేనంబర్‌లో ప్రభుత్వ భూమిలో వివాదాస్పద వాల నారాయణరావు ప్లాట్‌లకు అనుమతులు జారీ చేశారు. అక్కడ ఇసుకబావికి చెందిన ఒక తాజా మాజీ కౌన్సిలర్ భర్త కాల్వ భూమిలో ఓ తాత్కాలిక షెడ్డు వేశారు.
సస్పెండ్ చేయాలి
అమీన్‌పూర్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతోంది. ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంది. అనుమతులు లేకుండా తాత్కాలిక షెడ్లను వేస్తున్నా పట్టించుకోవడం లేదు. కొత్తగా విలీనమైన గ్రామాల్లో పంచాయతీ అనుమతులతో బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ అధికారుల అవినీతి కారణంగా అమీన్‌పూర్ పట్టణంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. అవినీతి అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన అధికారులు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి ఇష్టానుసారం అనుమతులు ఇస్తున్నారు. వారిని సస్పెండ్ చేయాలి.
–నాయిని నరసింహారెడ్డి
సీఐటీయూ జిల్లా నాయకుడు
నిబంధనల మేరకే అనుమతులు
నిబంధనల మేరకే అనుమతులను జారీ చేస్తున్నాం. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం లేదు. అన్నింటిపై చర్యలు తీసుకుంటాం.
–పవన్, టౌన్ ప్లానింగ్ అధికారి, అమీన్‌పూర్


