పేదింటి సరస్వతీ పుత్రులు | - | Sakshi
Sakshi News home page

పేదింటి సరస్వతీ పుత్రులు

May 1 2025 7:31 AM | Updated on May 1 2025 7:31 AM

పేదిం

పేదింటి సరస్వతీ పుత్రులు

బుధవారం విడులైన పదవ తరగతి ఫలితాల్లో పేదింటి సరస్వతీ పుత్రులు మెరిశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ.. ఇంట్లో కష్టాలు ఉన్నా ఎదుర్కొని అత్యుత్తమ మార్కులు సాధించారు.

రైతు బిడ్డ మండల టాపర్‌

చిన్నశంకరంపేట(మెదక్‌): నిరుపేద రైతుబిడ్డ పదవ తరగతి ఫలితాల్లో మండల టాపర్‌గా నిలిచింది. చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కాశబోయిన క్రిష్ణ, భాగ్య కూతురు రాజేశ్వరీ రోజు రెండు కిలోమీటర్లు కాలినడకన వచ్చి మడూర్‌ జెడ్పీపాఠశాలలో చదివింది. కష్టం ఎదురైనా చుదువును ఇష్టంగా చేసుకొని పదవ తరగతి ఫలితాల్లో 570 మార్కులు సాంధించి మండల టాపర్‌గా నిలిచింది. తన కూతురిని ట్రిపుల్‌ ఐటీ చదివించాలనే కల ఉందని విద్యార్థి తండ్రి కృష్ణ తెలిపారు.

హోంగార్డు కూతురు..

కౌడిపల్లి(నర్సాపూర్‌): పదవ తరగతి ఫలితాల్లో మండలంలోని వెల్మకన్న ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్‌.రాజేశ్వరీ 576 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. స్వగ్రామం కిష్టాపూర్‌ కాగా వెల్మకన్నలో అమ్మమ్మగారి ఇంటివద్ద ఉంటూ చదువుతుంది. తండ్రి ఫైర్‌ స్టేషన్‌లో హోంగార్డుగా, తల్లి గృహిణిగా ఉన్నారు. బాసర ట్రిబుల్‌ఐటీలో సీటు వస్తే ఇంజనీరింగ్‌ చేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలో చదివి మండల టాపర్‌గా నిలవడంతో గ్రామస్తులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

తండ్రి కార్పెంటర్‌..

కూతురు టాపర్‌

రామాయంపేట(మెదక్‌): ప్రగతి ధర్మారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కమ్మరి ప్రశాంతి పదవ తరగతిలో 600 గాను 560 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. ఆమె స్వగ్రామం చేగుంట మండలం కిష్టాపూర్‌ . తండ్రి కమ్మరి మహేందర్‌కు గ్రామంలో కార్పెంటర్‌గా పనిచేస్తాడు. అతడి కష్టంతోనే ఆ కుటుంబం సాగుతుంది. మహేందర్‌ పెద్ద కుమారుడు ఇంటర్‌ పూర్తి చేయగా, కూతురు పదో తరగతి చదువుతుంది. తన తండ్రి కష్టం చూసి బాధ కలుగుతుందని, దీనితో తాను చదుపుపై దృష్టి సారించి రాత్రింబవళ్లు కష్టపడి చదివి ర్యాంక్‌ సాధించినట్లు ప్రశాంతి తెలిపింది. తనకు డాక్టర్‌ కావాలని కోరిక ఉందని ఆమె పేర్కొంది.

కష్టాలు పక్కన పెట్టి.. లక్ష్యాన్ని గురి పెట్టి

నారాయణఖేడ్‌: తండ్రి లేడన్న బాధ.. తల్లి కష్టపడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న కష్టం.. అయినా మొక్కవోని ధైర్యంతో ఆ చిన్నారి చదువుపై దృష్టి సారించింది. పదవ తరగతి ఫలితాల్లో ఖేడ్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న శ్రీలేఖ 581 మార్కులతో నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో టాపర్‌గా నిలిచింది. సిర్గాపూర్‌ మండల కేంద్రానికి చెందిన అవుటి యాదవులు, మౌనిక ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురే శ్రీలేఖ. యాదవులు కొన్నేళ్ల కిందట మరణించారు. కుటుంబ భారం, కష్టాలు పైన పడటంతో మౌనిక కండక్టర్‌గా విధుల్లో చేరారు. తమ పిల్లలకు కష్టాలు రాకూడదని చదివిస్తుంది. ఉపాధ్యాయురాలు కావాలనేదే తన లక్ష్యమని శ్రీలేఖ చెబుతుంది.

తండ్రి దినసరి కూలీ..

తల్లి బీడీలు చుడుతూ..

చేగుంట(తూప్రాన్‌): చేగుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివే కొటారి శ్వేత పదో తరగతిలో 564 మార్కులు సాధించి మండల స్థాయి లో ఐదో స్థానంలో నిలి చింది. శ్వేత తండ్రి కుమార్‌ ఓ ప్రైవేటు పరి శ్రమలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. తల్లి జ్యోతి బీడీలు చుడుతూ కూతురిని చదివిస్తున్నా రు. రోజూ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేగుంట పాఠశాలకు వచ్చి చదువుకునేది.

తండ్రి చనిపోయాడనే

దుఃఖాన్ని దిగమింగుకొని

నంగునూర్‌(సిద్దిపేట): మండలంలోని నర్మెట ఉన్నత పాఠశాలలో 10 తరగతి చదువుతున్న గంధమల్ల సిరి చందన పరీక్షలు రాస్తున్న సమయంలో తండ్రి యాదగిరి అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంగ్లిష్‌ పరీక్ష రాసి ఇంటికి రాగానే తండ్రి చనిపోయాడని తెలియడంతో మనో వేదనకు గురైంది. దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్షలు రాసిన సిరి చందన 471 మార్కులు సాధించింది.

మట్టిలో మాణిక్యం నందిని

కొల్చారం(నర్సాపూర్‌): మండలంలోని వరి గుంతం ఉన్నత పాఠశాలలో చదువుతున్న నందిని 554 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. నందిని కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలే. తండ్రి 2023లో అనారోగ్యంతో మృతి చెందడంతో ఆడపిల్లల భారం తల్లి దుర్గమ్మపై పడింది. నందిని రెండవ సోదరి ఇంటర్‌ చదివి కుటుంబ పోషణ భారం కావడంతో తల్లితో పాటు వేరే చోట కూలీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నందిని నానమ్మతో కలిసి గ్రామంలోని ఉంటూ చదువుతుంది. తోబుట్టువులు ఇచ్చిన ప్రోత్సాహంతో పదిలో ఉత్తమ ఫలితాలు సాధించి వారి నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి సత్యనారాయణ రావు, సిబ్బంది విద్యార్థినిని అభినందించారు.

పేదింటి సరస్వతీ పుత్రులు 1
1/7

పేదింటి సరస్వతీ పుత్రులు

పేదింటి సరస్వతీ పుత్రులు 2
2/7

పేదింటి సరస్వతీ పుత్రులు

పేదింటి సరస్వతీ పుత్రులు 3
3/7

పేదింటి సరస్వతీ పుత్రులు

పేదింటి సరస్వతీ పుత్రులు 4
4/7

పేదింటి సరస్వతీ పుత్రులు

పేదింటి సరస్వతీ పుత్రులు 5
5/7

పేదింటి సరస్వతీ పుత్రులు

పేదింటి సరస్వతీ పుత్రులు 6
6/7

పేదింటి సరస్వతీ పుత్రులు

పేదింటి సరస్వతీ పుత్రులు 7
7/7

పేదింటి సరస్వతీ పుత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement