
అయ్యో ట్రాన్స్‘ఫార్మర్లు’
● రాయపోలు మండలంలోట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు ● కరువు కాలంలో ఇదేందనిరైతుల ఆందోళన
దుబ్బాకటౌన్ : అసలే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలకు నీళ్లు అందక రైతులు నానా తంటాలు పడుతున్నారు. దీనికి తోడు రాయపోల్ మండలంలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాయిల్స్ దొంగిలించడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
కాయిల్స్ దొంగిలించి
రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో మంగళవారం అర్థరాత్రి మల్కాపూర్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద గల వ్యవసాయ పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి దానిలోని కాయిల్స్, ఆయిల్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. గమనించిన రైతులు పోలీసులకు విద్యుత్, అధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 50 వేల విలువ గలవి ఎత్తుకెళ్లారని విద్యుత్ అధికారులు చెప్పారు. పంటలు చివరి దశకు వచ్చాయని ఈ సమయంలో నీటిపారుకం ఎంతో అవసరమని రైతులు రోదిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గతంలో దొంగల ముఠా అరెస్టు
ఐదు నెలల కిందట రాయపోల్ మండల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్‌లను దొంగిలించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తొగుట సీఐ లతీఫ్ ఆధ్వర్యంలో రాయపోల్ పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. అయినప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలు ఆగకపోవడంతో రైతులు భయందోళనకు గురవుతున్నారు.
వ్యవసాయం చేసేదెట్లా..
ట్రాన్స్‌ఫార్మర్ దొంగలు రైతులను ఆగమాగం జేస్తుర్రు. నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి. ఉన్న నీళ్లతో పంట పండిదామంటే ఇప్పుడు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇట్లయితే వ్యవయసాయం ఎట్లా చేయమంటారు. అధికారులు దొంగలను పట్టుకోవాలి.
– నిరుడి మల్లమ్మ, మహిళా రైతు

అయ్యో ట్రాన్స్‘ఫార్మర్లు’