సమస్యలతో సహజీవనం
సరుకులు మాయం!
ఐదే మరుగుదొడ్లు
నారాయణఖేడ్: సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న పిల్లలను తమ కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన అధికారులు వారిని అర్థాకలితో అలమటింపచేస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో వారిని ఉంచుతూ కనీస వసతి సదుపాయాలను కూడా కల్పించలేకపోతున్నారు సదరు హాస్టళ్ల అధికారులు. వసతిగృహాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఇటువంటి ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఇటీవల సిర్గాపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు పురుగులు పట్టిన నాసిరకం కూరగాయలతో భోజనం వడ్డిస్తుండటంతో విద్యార్థులు రాత్రిపూట రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. ఇదే హాస్టల్‌కు చెందిన వార్డెన్ తన కింది స్థాయి సిబ్బందికి ఫోన్‌లో ‘‘అన్నంలో పురుగుల మందు కలిపి పిల్లల్ని చంపేడయండి’’అంటూ హుకుం జారీ చేయడం, ఆ ఆడియో వైరల్ కావడం చర్చనీయాంశంగా మారడంతోపాటు విద్యార్థుల భద్రతపై ఆందోళన లేవనెత్తింది.
విద్యార్థుల ధర్నా చేసిన విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రావీణ్య ఈ ఘటనపై విచారణ జరిపి సదరు వార్డెన్‌ను విధుల నుంచి తొలగించారు. ఇలాంటి పరిస్థితి ఒక్క సిర్గాపూర్ హాస్టల్ విద్యార్థులే కాదు మెజార్జీ సంక్షేమ హాస్టళ్లలో దాదాపు ఇవే దుస్థితులను విద్యార్థులు మౌనంగా ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 48 సాంఘిక సంక్షేమ వసతిగృహాలు ఉండగా వీటిల్లో 5,068మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను ఎవరు పరిష్కరిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి సిర్గాపూర్, మనూరు, ఖేడ్, జహీరాబాద్‌లలోని బాలికల వసతిగృహం భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని కూల్చివేసి నూతన భవనాలు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారు.
సమస్య వచ్చినపుడే ఆదరా బాదరా..
వసతిగృహాలపై పర్యవేక్షణ కొరవడటం, విద్యార్థులు ఆందోళనలకు దిగి పత్రికల్లో కథనాలు వచ్చిన సందర్భాల్లోనే అధికారులు ఆదరా బాదరాగా హడావుడి చేయడం కన్పిస్తోంది. సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే చిత్తశుద్ధి అధికారుల్లో కనిపించకపోవడం శోచనీయం. దీంతో విద్యార్థులు నిత్యం సమస్యలతో సహజీవనం చేస్తూనే ఉన్నారు. తరచూ ఉన్నతాధికారుల తనిఖీలు, పర్యవేక్షణ ఉంటే వార్డెన్లు కాస్తయినా జాగరూకతతో వ్యవహరిస్తారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల దుస్థితి
అర్థాకలితో అలమటిస్తున్న చిన్నారులు
ప్రశ్నిస్తే వేధింపులు..
మనూరు మండల కేంద్రంలోని హాస్టల్‌లో 15 మరుగు దొడ్లకు గాను 5 మాత్రమే పనిచేస్తున్నాయి. విద్యార్థులు ఉదయం పూట మరుగుదొడ్డికి వెళ్లేందుకు క్యూ కట్టాలి. భవనం శిథిలావస్థకు చేరుకుంది. నాణ్యమైన భోజనం ఇక్కడ కూడా వడ్డించడంలేదని విద్యార్థులు చెబుతున్నారు. నాసిరకం కూరగాయలు పెడుతున్నారని, అప్పుడప్పుడూ ఇచ్చే చికెన్ కూడా తక్కువగానే ఇస్తున్నారని వాపోతున్నారు. అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వార్డెన్ వేధిస్తారేమోనని పిల్లలు భయపడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
కాగా, హాస్టళ్లలో సామగ్రి, సరుకుల తరచూ మాయమవుతుంటాయి. సిర్గాపూర్ హాస్టల్‌కు వచ్చిన కొన్ని మంచాలు, బెడ్‌లు మాయం అయ్యాయన్న ఆరోపణలున్నాయి. సరైన బెడ్లు లేకపోవడంతో విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారిస్తే పలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై ఖేడ్ ఏఎస్‌డబ్లూఓ శ్రీనివాస్‌ను వివరణ కోరగా బెడ్లు కొన్ని వేరే హాస్టల్‌లో తక్కువగా ఉండటంతో అక్కడకు పంపించామని తెలిపారు.
సమస్యలతో సహజీవనం


