వెహికిల్స్‌పై నజర్
సంగారెడ్డి జోన్/టౌన్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించని వారికి, సరైన పత్రాలు లేకుండా, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై ఈ తనిఖీల్లో కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో మళ్లీ మళ్లీ పట్టుబడితే జైలుకు పంపిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పెరిగిన తనిఖీలు
రోడ్డు భద్రతా నియమాలు ప్రతీ వాహనదారుడు పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఐదు పోలీస్ సబ్ డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన చౌరస్తాలు, రద్దీ ప్రదేశాలు, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన స్పీడ్ గన్ ద్వారా ఓవర్ స్పీడ్ చలాన్లు విధిస్తున్నారు. గతేడాది వాహన తనిఖీల్లో 3,25,660 కేసులు నమోదు చేసి రూ.10,82,17,328లు జరిమానాలు విధించారు. అంతకుముందు ఏడాదిలో 2,06,687 కేసులు నమోదు చేసి రూ.7,58,48,351ల మేర జరిమానాలు విధించారు. వీటితోపాటు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరం చేయగా గతేడాది 16,326 కేసులు నమోదుచేసి రూ.1,85,90,315 ల జరిమానా విధించారు. పలుమార్లు మద్యం తాగి పట్టుబడిన 65 మందిని జైలుకు పంపించారు.
తగ్గిన రోడ్డు ప్రమాదాలు
తనిఖీలు ముమ్మరం చేయడంతో రోడ్డు ప్రమాదాలు కొంత మేర తగ్గినట్లు తెలుస్తోంది. 2025లో 917 రోడ్డు ప్రమాదాలు జరగగా 423 మంది మృత్యువాత పడ్డారు. 895 మంది గాయాలపాలయ్యారు. అంతకుముందు ఏడాది 958 రోడ్డు ప్రమాదాలు జరగగా 433 మంది మృత్యువాత పడగా, 1011 మందికి గాయాలయ్యాయి.
పట్టుబడుతున్న చోరీ వాహనాలు
జిల్లాతో పాటు సరిహద్దు రాష్ట్రాలలో చోరీకి గురైన వాహనాలు తనిఖీలలో పట్టుబడుతున్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని కోర్టుకు జప్తు చేసి, యజమానులకు ఇస్తున్నారు. అదేవిధంగా కొన్ని కేసులలో అనుమానితులు, నిందితులను గుర్తించడానికి దోహదపడుతున్నాయి. అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక, నిషేధిత డ్రగ్స్, గంజాయి, గుట్కా, పాన్ మసాలా వంటివి పట్టుబడుతున్నాయి. గతేడాది 786.635 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 80 మంది నిందితులను అరెస్టు చేశారు. 248 అక్రమ ఇసుక రవాణ కేసులు నమోదయ్యాయి.
చికిత్స తప్పనిసరి
డ్రైవర్లు కంటి సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవాలి. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం సంగారెడ్డి ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించాం. డ్రైవర్ల కంటిచూపు మెరుగుపడటం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారించవచ్చు.
– అరుణ, జిల్లా రవాణా అధికారి
జిల్లాలో వాహన తనిఖీ–జరిమానా వివరాలు
ఏడాది తనిఖీలు జరిమాన డ్రంకెన్ డ్రైవ్ జరిమాన
2024 2,06,687 రూ.7,58,48,351 10,216 రూ.1,31,90,473
2025 3,25,660 రూ.10,82,17,328 16,326 రూ.1,85,90,315
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ముమ్మర తనిఖీలు
గతేడాది 3,25,660 కేసులు
డ్రంకెన్ డ్రైవ్‌లో 10,216 మందికి జరిమానా


