న్యాయసేవలు
మహిళా సంఘాలకు
● గ్రామస్థాయిలోనే పరిష్కారానికి ఏర్పాటు
● జిల్లాలో రెండు మండలాల్లో జీఆర్‌సీల అమలు
సంగారెడ్డి టౌన్: గ్రామాల్లోని మహిళలు సమాజంలో గౌరవంతోపాటు ఇబ్బందులు ఎదురైనప్పుడు వారికి అవసరమైన న్యాయపరమైన సేవలను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామాల్లోని మహిళలు వివిధ రకాల సమస్యలకు గురైనప్పుడు వారికి అవగాహన కల్పించేందుకు, వివిధ రకాల తగాదాలను గ్రామస్థాయిలోనే పరిష్కరించుకునేందుకు న్యాయ సేవలు అందించేలా గ్రామ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ గ్రామ కమిటీల్లో మహిళా సంఘంలోని మహిళలే సభ్యులుగా వ్యవహరిస్తారు. మహిళకు ఎదురయ్యే సమస్యలను పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లకుండా వీలైనంత వరకు గ్రామాలలోనే పరిష్కరించుకునే విధంగా కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను జెండర్ రిసోర్స్ సెంటర్లు (జీఆర్‌సీ)గా వ్యవహరిస్తున్నారు.
ఇదీ ఉద్దేశ్యం..
అటు సామాజిక మాధ్యమాలతోపాటు ఇంటా బయట మహిళలకు ఎదురయ్యే చాలా ఘటనల్లో ఎవరికీ చెప్పుకోకుండా వారివారే మానసికంగా కుమిలిపోతున్నారు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా మిన్నకుండిపోతున్నారు. ఇటువంటి మహిళల కోసమే ఈ జీఆర్‌సీలను ఏర్పాటు చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో మహిళా ప్రతినిధులే వీటిని నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కమిటీలు బాధిత మహిళలకు అండగా నిలిచి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తోడ్పాటునందిస్తాయి. ఈ కేంద్రాల్లోనే ఒకటి రెండు రోజులు వసతి సదుపాయం కలిస్పారు. ప్రత్యేక కమిటీలు మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయి. పొదుపు సంఘాల్లోని మహిళల్లో చదువుకున్న వారు ఆర్పీలుగా సేవలందిస్తున్నారు.
జీఆర్‌సీ సభ్యులకు ప్రత్యేక శిక్షణ
గ్రామ, మండల సమాఖ్య సంఘాల్లోని సభ్యులతో సామాజిక కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. గ్రామ కమిటీ, మండల కమిటీ చొప్పున సభ్యులను నియమిస్తారు. వీరికి డీఆర్‌డీఏ తరఫున జెండర్ రీసోర్స్ సెంటర్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణనిస్తారు. తొలుత సంగారెడ్డి, ఝరాసంఘం మండలాలను ఎంపిక చేసి జీఆర్‌సీ సేవలు కొనసాగిస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
సమాజంలో మహిళలకు భద్రత కల్పించే విధంగా జెండర్ సేవలను కల్పిస్తున్నాం. గ్రామస్థాయిలోనే పూర్తిగా పరిష్కరించుకునేందుకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచుతున్నాం. మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం.
–సూర్యారావు,
జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి.
న్యాయసేవలు


