బడుల తనిఖీలు షురూ
ఇవీ లక్ష్యాలు
జిల్లా వ్యాప్తంగా 15 కమిటీల
నియామకం
జహీరాబాద్ టౌన్: ప్రభుత్వ బడులపై పర్యవేక్షణ పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. విస్తృత తనిఖీలతో పాఠశాల నిర్వహణను గాడిలో పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా బలోపేతం చేసే లక్ష్యంతో తనిఖీ బృందాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఉపాధ్యాయులతో 15 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న వ్యవస్థకు ప్రత్యేక బృందాలు అదనంగా పనిచేస్తున్నాయి.
బృందాలు ఇలా...
సంగారెడ్డి జిల్లాలో 15 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యూపీఎస్, ప్రాథమిక పాఠశాలతోపాటు ఉర్దూ మీడియం పాఠశాలలకు వేర్వేరుగా టీంలను నియమించింది. ఒక్కో టీమ్‌లో ముగ్గురు టీచర్లు ఉంటారు. ప్రతీ బృందంలో మొదటి వ్యక్తి నోడల్ అధికారిగా మిగిలిన ఇద్దరు సభ్యులు కొనసాగుతారు. ప్రత్యేక బృందాలు పాఠశాలలను సందర్శించి విద్యా ప్రగతిని అంచనా వేస్తాయి. తనిఖీకి నియమితులైన టీచర్లు పాఠశాల విధులకు హాజరయ్యేందుకు అవకాశం లేదు. బోధనకు అంతరాయం కలగకుండా వారిస్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రతీ మూడు నెలల్లో ఒక్కో టీం ప్రాథమిక, ప్రాథమికోన్నతస్థాయిలో వంద పాఠశాలలు, ఉన్నత పాఠశాల స్థాయిలో 50 పాఠశాలలను తనిఖీలు చేపట్టాలి. కేటాయించిన పాఠశాలలను ప్రత్యేక బృందం సభ్యులు ప్రతీ రోజు రెండు చొప్పున తనిఖీ చేస్తూ వాటి అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. తనిఖీ టీంలు పది రోజులకు ఓసారి డీఈఓకు నివేదికలను సమర్పిస్తారు. ఇలా ఉండగా పాఠశాల తనిఖీల పట్ల ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచి వాటిని బలోపేతం చేయడం.
నిరంతర సమగ్ర మూల్యాంకన సాధన.
ప్రాథమిక స్థాయిలోఎఫ్‌ఎల్‌ఎన్, ఉన్నత పాఠశాల స్థాయిలో ఎల్‌ఐపీ ప్రణాళిక అమలు.
విద్యా ప్రమాణాల పెంపుదల.
టెక్ట్స్ బుక్, వర్క్‌షాపులతో విద్యార్థులకు అభ్యాసన.
క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం.
సలహాలు సూచనలు ఇవ్వడం, పాఠశాల రికార్డుల పరిశీలన.


