కుట్టు.. ఆదాయం పట్టు
చేతి నిండా పనితో మహిళలు
● పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు కుడుతూ ఉపాధి ● వేసవిలో మహిళలకు ఆర్థిక భరోసా ● ఆదాయం పొందుతున్న మహిళలు
సంగారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఇంటి వద్దనే ఉంటూ వివిధ రకాల పథకాల రూపంలో స్వయం సహకార సంఘాలు మరింత అభివృద్ధి పథంలో పయనించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వివిధ పథకాలను ఆయా మహిళా సంఘాలకు అందజేస్తూ..స్వయం ఉపాధికి బాటలు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల (యూనిఫాం) తయారీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించింది. దీంతో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు ఈ వేసవిలో ఇంట్లోనే ఉంటూ దుస్తులు కుడుతూ ఉపాధి పొందుతున్నారు. విద్యార్థుల కొలతలు తీసుకుని ఇంటి వద్దనే ఉంటూ బాలబాలికల దుస్తులను కుడుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు ఇప్పటికే కుట్టు పనులు ప్రారంభించారు.
గ్రామీణాభివృద్ధి అధికారుల పర్యవేక్షణలో....
యూనిఫామ్‌లు కుట్టే ప్రక్రియను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,95,235 మంది సభ్యులుండగా, మహిళా సంఘాలు 18,208 అందులో 25 మండలాల్లోని 695 గ్రామాల్లో గ్రామ సంఘాల్లోని మహిళలున్నారు. అందులో ప్రస్తుతం 948 మంది దుస్తులు కుడుతున్నారు. మహిళా సంఘం సభ్యులు ప్రతి ఒక్కరూ కుట్టే దుస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే వారికి డబ్బులను అందజేస్తున్నారు. అయితే మహిళా సంఘాల సభ్యులు కుట్టిన దుస్తులను అధికారులు పాఠశాలలకు అందజేయనున్నారు.
ఆ సమయనికల్లా అందజేత...
పాఠశాలలను తెరిచే సమయానికి అందించాలని జిల్లాలోని అన్ని పాఠశాలలకు దుస్తులు చేరే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. సంగారెడ్డితోపాటు జిల్లాలోని వివిధ మండలాల్లో, గ్రామాల్లో మహిళలు ఉపాధి పొందుతున్నారు. ప్రతీఒక్కరు రోజుకు 10 జతల చొప్పున ఈ సభ్యులంతా కలసి రోజులో 7,584 జతలు యూనిఫాం దుస్తులు కుడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో కుట్టిన ప్రతీ యూనిఫాం జతను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
గడువులోపు అందిస్తాం
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని స్వయం సహాయక సంఘ సభ్యులు ఉపయోగించుకోవాలి. మహిళలకు ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది. పాఠశాలలు ప్రారంభం నాటికి దుస్తులు కుట్టడం పూర్తవుతుంది. గడువు లోపే అన్ని పాఠశాలలకు యూనిఫాం దుస్తులను అందిస్తాం.
–జంగారెడ్డి, జిల్లా అదనపు డీఆర్డీవో
కుట్టు.. ఆదాయం పట్టు
కుట్టు.. ఆదాయం పట్టు


