
ఆటలాడుకుందాం రండి
● మే 1 నుంచి వేసవి శిబిరం ప్రారంభం ● ఈనెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
సంగారెడ్డి జోన్: పాఠశాలలకు సెలవులు ప్రకటించటంతో విద్యార్థులకు క్రీడలపై శిక్షణ అందించేందుకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కసరత్తు ప్రారంభించింది. ప్రతీ ఏడాది మాదిరిగానే పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలో శిబిరాలను ఏర్పాటు చేసి, శిక్షణ అందించనున్నారు. ఇప్పటికే శిక్షణ అందించే కేంద్రాలను గుర్తించారు. అదేవిధంగా శిక్షణ అందించే కోచ్‌లను సైతం నియామకం చేసింది. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలలో రాణించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నెలరోజులపాటు కార్యక్ర మాలు
వేసవి శిక్షణ కార్యక్రమాలు మే 1న ప్రారంభమై మే 31 వరకు కొనసాగనున్నాయి. నెల రోజులపాటు యువతకు ఆసక్తి ఉన్న క్రీడలలో ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగనున్నాయి. శిక్షణ పూర్తి అయిన తర్వాత యువతకు శాఖ తరఫున సర్టిఫికెట్లు అందిస్తారు.
14 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలకే...
క్రీడా శిబిరాలలో14 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలబాలికలకు మాత్రమే శిక్షణ అందిచనున్నారు. ఆసక్తి గల బాల, బాలికలు ఈ నెల 31 వరకు జిల్లా క్రీడల అధికారి ఫోన్ నం:7981798957 కు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
పలు క్రీడలపై శిక్షణ
గ్రామీణ ప్రాంతాల్లో బాక్సింగ్, కిక్ బాక్సింగ్, అథ్లెట్స్, కబడ్డీ, చెస్, ఫుట్‌బాల్ పట్ణణ ప్రాంతాలలో హ్యాండ్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, వుషు క్రీడలలో శిక్షణ కల్పించనున్నారు.
గ్రామీణప్రాంతాల్లో 10..పట్టణ ప్రాంతాల్లో 12
జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో 10, పట్టణ ప్రాంతాలలో 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రాల నిర్వహణకు రూ.50వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. క్రీడా సామగ్రి కొనుగోలుతోపాటు శిక్షణ అందించే కోచ్‌లకు పారితోషికంగా రూ.4వేలు అందించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
జల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలను 14 సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో 22 కేంద్రాలను ఏర్పాటు చేశాం. మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
–ఖాసీం బేగ్, జిల్లా యువజన,
క్రీడల అధికారి, సంగారెడ్డి

ఆటలాడుకుందాం రండి