
చిరుతపులి దాడిలో లేగదూడ మృతి
నారాయణఖేడ్: లేగదూడపై చిరుతపులి దాడి చేసి చంపింది. ఈ ఘటన ఆదివారం నారాయణఖేడ్ మండలంలో జరిగింది. బాధిత రైతు నారాయణ, గ్రామస్తుల కథనం ప్రకారం.. సంజీవన్‌రావుపేట్ గ్రామానికి చెందిన రైతు నారాయణ శనివారం రాత్రి గ్రామ శివారులోని తన చేను వద్ద పశువులను కట్టేసి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం వెళ్లి చూడగా లేగదూడ శరీరం ఛిద్రమై మృతిచెంది ఉంది. గ్రామానికి కొద్దిదూరంలో అటవీ ప్రాంతం ఉండటంతో చిరుతపులి వచ్చి లేగదూడపై దాడి చేసి ఉండవచ్చని అనుమానించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది సందర్శించి పరిసరాల్లో గుర్తించిన పాదముద్రల ఆధారంగా చిరుతపులి సంచరించినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. ఖేడ్ అటవీశాఖ రేంజ్ అధికారి అనురాధ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను చేను వద్ద కట్టేయవద్దని సూచించారు. చిరుత ఎవరికై నా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.