పేదోడి కడుపు నింపేందుకే సన్న బియ్యం
● గరిబోళ్ల ఆరోగ్యం, ఆత్మగౌరవంపెంచిన కాంగ్రెస్ సర్కార్ ● కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ ● ముత్తంగిలో దళితుల ఇంట్లో భోజనం
పటాన్‌చెరు టౌన్: ప్రతీ పేదోడి కడుపు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగిలో దళిత సోదరుడు విఠల్ ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనం కుటుంబ సభ్యులతో కలిసి చేశారు. ఈ సందర్భంగా సన్నబియ్యం పంపిణీతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న పాలనపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దీనికి ఆ కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల ప్రజలు సానుకూలంగా సమాధానం చెప్పి ఇందిరమ్మ పాలనపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ.. గతంలో దొడ్డు బియ్యం పంపిణీతో అన్నం తినలేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడేవారని మరో పక్క దొడ్డు బియ్యం పక్కదోవ పట్టి దళారుల దందాకు ఉపయోగపడేవన్నారు. అందుకే నిరంతరం పేదల సంక్షేమం అభివృద్ధి కోసం ఆలోచించే సీఎం రేవంత్ రెడ్డి ప్రతీ పేద బిడ్డ కడుపు నింపాలనే తలంపుతో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ముత్తంగి మాజీ ఎంపీటీసీ గడ్డ యాదయ్య, నాయకులు శ్రీను, అశోక్, సన్నీ యాదవ్, శంకర్, దశరథ్, వెంకటేశ్, శ్రీను, ప్రవీణ్, కాళిదాస్, రాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


