
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్ డిమాండ్ చేశారు. గురువారం మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో ఆల్ ట్రేడ్స్ యూనియన్స్ నాయకులు ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి, సామాన్యులపై భారం మోపుతుందన్నారు. కార్పోరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారని ఆరోపించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఉన్న ఉద్యోగాలకు ముప్పు తెస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు, కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు మే 20న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నట్లు తెలిపారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అజ్జమర్రి మల్లేశం, జిల్లా కోశాధికారి కడారి నర్సమ్మ, కోరింకల మల్లేశం, సంతో ష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నందం, వివిధ రంగాల కార్మికులు, ఆల్ ట్రేడ్స్ యూనియన్స్ నాయకులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలపై మే 20 సమ్మె
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమేశ్