పచ్చి వడ్లు అమ్మి మోసపోకండి
హుస్నాబాద్‌రూరల్: రైతులు పచ్చి వడ్లు అమ్మి ఆర్థిక నష్టాలను కొని తెచ్చుకోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320 పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మంగళవారం పోతారం(ఎస్)లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మనుచౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభమవుతున్నాయన్నారు. జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రం హుస్నాబాద్ నియోజకవర్గంలోనే ప్రారంభించామని రైతులకు కావాల్సిన గన్నీ బ్యాగులను అధికారులు సమకూర్చుతారని చెప్పారు. జిల్లాలో 419 ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా అందులో 212 ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి సోలార్ ప్లాట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు నిర్వహణ మహిళ సంఘాలకే ఇస్తే ఆర్థిక ప్రగతి సాధిస్తారన్నారు. ధాన్యం రవాణకు ఇబ్బందులు లేకుండా గుత్తేదారులతో మాట్లాడి లారీలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలని, తూకంలో మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకోని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్‌డీఏ పీడీ జయదేవ్ ఆర్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీవో రాంమూర్తి, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన
పోతారం(ఎస్)లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


