కారం పొడి చల్లి.. బంగారు గొలుసు చోరీ
బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లో దారి దోపిడీ
రామచంద్రాపురం(పటాన్‌చెరు): స్కూటీపై వెళ్తున్న వారిపై గుర్తు తెలియని దుండగులు కారంపొడి చల్లి బంగారు గొలుసును లాక్కొని పరారైన ఘటన బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లో మంగళవారం తెల్లావారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సాఆర్ జిల్లాకు చెందిన ఆరోగ్యమ్మ జీవనోపాధికై 20 ఏళ్ల కిందట రామచంద్రాపురానికి కుటుంబ సభ్యులతో కలిసి వలస వచ్చారు. భర్త 5 ఏళ్ల కిందట మృతి చెందాడు. దీంతో వంట పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. పెన్షన్ తెచ్చుకునేందుకు సోమవారం రాత్రి స్వగ్రామానికి బయలుదేరింది. బస్సు ఎక్కడం కోసం అల్లుడు సూర్యతేజ స్కూటీపై ఇంటి నుంచి లింగంపల్లికి వెళ్తుంది. బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లోని యూనియన్ కార్యాలయం వద్ద రాగానే బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు దుండగులు వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టారు. కింద పడిపోయిన ఆరోగ్యమ్మ, సూర్యతేజ కళ్లల్లో దుండగులు కారంపోడి చల్లి మహిళ మెడలో నుంచి రెండున్నర తూలాల బంగారు గొలుసును లాక్కొని పరా రయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పెపల్లిలో విషాదం
ఒకే రోజు గ్రామంలో
ఇద్దరు యువకులు మృతి
జహీరాబాద్ టౌన్: మొగుడంపల్లి మండలంలోని ఇప్పెపల్లి గ్రామంలో ఒకే రోజు ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కమ్మరి శ్రీనివాస్(28) మన్నాపూర్ గ్రామంలో కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. దుకాణంలో పనులు చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే, అదే గ్రామానికి చెందిన నాగప్ప(26)కు వడ దెబ్బతగిలి రెండు రోజుల నుంచి విరేచనాలు అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఒకే రోజు గ్రామంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకుంది.


