నేనూ వస్తా బిడ్డో.. సర్కారు దవాఖానకు | - | Sakshi
Sakshi News home page

నేనూ వస్తా బిడ్డో.. సర్కారు దవాఖానకు

Nov 11 2024 7:45 AM | Updated on Nov 11 2024 11:56 AM

అక్టోబర్‌ నెలలో రికార్డు స్థాయిలో 836 ప్రసవాలు

ఇతర జిల్లాల నుంచీ ప్రసవాల కోసం వస్తున్న గర్భిణులు

సంగారెడ్డి: బిడ్డకు జన్మనివ్వడం అంటే తల్లికి పునర్జన్మలాంటిదంటారు. గర్భిణులకు అటువంటి బాధ లేకుండా అందరితో భేష్‌ అనిపించుకునే రీతిలో ప్రసూతి వైద్య సేవల్ని అందిస్తోంది సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి. ప్రసూతి సేవలతోపాటు ఇతర వైద్య సేవల్లోనూ రోగులకు కొండంత అండగా నిలుస్తూ అటు ప్రజలనుంచి ఇటు ప్రభుత్వం నుంచి ప్రశంసల్ని పొందుతోంది ఈ ఆస్పత్రి. అందుకే జిల్లా కేంద్రంలోని ఈ ఆసుపత్రికి ఇతర జిల్లాలనుంచి కూడా రోగులు, గర్భిణులు వచ్చి ఉచిత వైద్యసేవలు పొందుతున్నారు. 

ఈ ఆస్పత్రిలో ఎంతో అనుభవం కలిగిన జనరల్‌ ఫిజీషియన్లు, సర్జన్లు, గైనకాలజిస్టులు రోగులకు వైద్య సేవల్ని అందిస్తున్నారు. జనరల్‌ ఆస్పత్రిలో ఉన్న కీలకమైన విభాగం మాతా శిశు కేంద్రంలో నిత్యం ఎంతోమందికి కాన్పులు చేస్తారు. కాన్పుల్లో సాధారణ ప్రసవాలు కొన్ని అయితే తప్పని పరిస్థితుల్లో చేసే సిజేరియన్‌ ్‌కాన్పులు కూడా ఉంటున్నాయి.

ప్రసూతి సేవలకోసం ఇతర జిల్లాల నుంచి..

మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల నుంచి కూడా ప్రసూతి సేవల కోసం గర్భిణులు ఈ ఆస్పత్రికి వస్తున్నారు. అనుభవం కలిగిన గైనకాలజిస్టులు, అనస్తీషియా, చిన్నపిల్లల వైద్యనిపుణులు ఉండటంతో అతిక్లిష్టమైన కేసుల్ని కూడా ప్రసవాలు చేసి తల్లీ, బిడ్డల ప్రాణాలు కాపాడుతున్నారు.

సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి, ఇతర వైద్యసేవలు భేష్‌

ప్రోత్సాహంతో మరిన్ని మెరుగైన సేవలు

ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర ఆదేశాలు, ప్రోత్సాహంతోనే ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయి. ఆస్పత్రిలోని డాక్టర్లు, సిబ్బంది సమిష్టి కృషితో మెరుగైన సేవలు అందిస్తున్నాం. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు కృషి చేస్తాం.

– డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, సూపరింటెండెంట్‌

పేదలకు నాణ్యమైన వైద్యమే లక్ష్యం

పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అన్ని వర్గాల ప్రజలకు విద్య ,వైద్యం అందినప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రానున్న రోజుల్లో మరెన్నో వైద్య సేవల్ని ప్రజలకు ఉచితంగా అందిస్తాము.

– దామోదర రాజనర్సింహ .. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

ఈ ఏడాది జిల్లా ఆసుపత్రిలో జరిగిన ప్రసవాల వివరాలు..

నెల - సాధారణప్రసవాలు - సిజేరియన్లు - మొత్తం

జనవరి - 421 - 284 - 705

ఫిబ్రవరి - 331 - 273 - 604

మార్చ్‌ - 345 - 328 - 673

ఏప్రిల్‌ - 413 - 346  - 759

మే - 401 - 381 - 782

జూన్‌ - 300 - 345 - 645

జూలై - 371 - 335 - 706

ఆగస్టు - 418 - 381 - 779

సెప్టెంబర్‌ - 358 - 354 - 712

అక్టోబర్‌ - 459 - 377 - 836

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement