లీజుకు అసైన్డ్ భూములు
● జోరుగా క్రయ విక్రయాలు కూడా ● పేదల భూముల్లో పెద్దల పాగా
హత్నూర(సంగారెడ్డి): ప్రభుత్వం పేదల కోసం ఇస్తున్న అసైన్డ్ భూముల్లో పెద్దలు పాగా వేస్తున్నారు. లీజు పేరుతో దస్తావేజులు తయారు చేసి అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తున్నారు. హత్నూర మండల కేంద్రంలో సర్వే నంబర్లు 115, 116, 132లలో వరుసగా 118 (ఎకరాలు), 315 (ఎకరాలు), 199 ఎకరాల అసైన్డ్ భూమి ఉండటంతో దశలవారీగా గత ప్రభుత్వాలు పేద ప్రజలకు అసైన్డ్ చేస్తూ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడంతో కబ్జాలో కొనసాగుతూ వచ్చారు. కొంతకాలంగా మండల కేంద్రమైన హత్నూర గ్రామ శివారులోని అసైన్డ్ భూములను జోరుగా ఇతర గ్రామాలకు చెందిన పట్టణాలకు చెందిన బడా నాయకులు లీజుల పేరుతో కొనుగోలు చేసి పాగవేశారు. సుమారు 80 ఎకరాల అసైన్డ్ భూమి వరకు క్రయవిక్రయాలు జరిగి ఉంటాయని పలువురు పేర్కొన్నారు. కాసాల గ్రామ శివారులో అసైన్‌మెంట్ విక్రయాల దందా జోరుగా సాగుతున్నాయి. సర్వే నంబర్ 336 లో
224 ఎకరాల అసైన్డ్ భూమిలో 200 మందికి పైగా పేద ప్రజలకు గత ప్రభుత్వాలు సర్టిఫికెట్లను మంజూరు చేశాయి. ప్రస్తుతం ఆ భూములు చాలావరకు కాంట్రాక్టర్లకు, బడా వ్యాపారుల చేతుల్లోకి మారిపోయాయి. అసైన్డ్ భూమిని లబ్ధిదారులకు ఎంతోకొంత డబ్బులు ముట్టజెప్పి బాండ్ పేపర్‌పై లీజు రాసుకుని ఇతర వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు.
ఫాంహౌజ్‌లు వేసుకుంటున్న
బడా నాయకులు
అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన బడా నాయకులు కాంట్రాక్టర్లు అసైన్డ్ భూమి చుట్టూ ఫంక్షనింగ్ పలకలు వేసుకుని దర్జాగా గేట్లు పెట్టుకుని ఫాంహౌజులు వేసుకుంటున్నారు. పేద ప్రజలకు కేటాయించిన అసైన్‌మెంట్ భూములను కొనుగోలు చేసిన వారిపై ఇటు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో యథేచ్ఛగా మండలంలో భూముల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. వీటితోపాటు చింతల్చెరు, బోరపట్ల, సిరిపుర, గుండ్ల మాచనూర్, ముచ్చర్ల, గ్రామాలలో సైతం అసైన్మెంట్ భూములు లబ్ధిదారుల నుంచి ఇతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పటికై నా అధికారులు అసైన్మెంట్ భూముల క్రయవిక్రయాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
క్రయ విక్రయాలు జరిగితే చర్యలే
పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను కొనుగోలు చేసినా విక్రయించినా చర్యలు తప్పవు. లీజుల పేరుతో అసైన్మెంట్ భూములను కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. పేదలకు ఇచ్చిన భూములు పేదలే సాగు చేసుకుని జీవనం పొందాలి.
–పర్వీన్ షేక్, తహసీల్దార్


