రేయింబవళ్లు ప్రచారమే
పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రచారాలు ఎన్నికల నిబంధనలు బేఖాతర్ ఏరులై పారుతున్న మద్యం
పటాన్‌చెరు: మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచేవారెవరో స్పష్టత రావడంతో ఇక ఎన్నికల ఘట్టంలో ఎంతో కీలకమైన ప్రచార పర్వానికి అభ్యర్థులు తెరతీశారు. ఇస్నాపూర్ పారిశ్రామికవాడలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు రాత్రి పూట సైతం తమ స్నేహితులు, బంధువులతో కలిసి వెళ్లి ఓట్లు వేయమని వేడుకుంటున్నారు. పగటిపూట కండువాలు కట్టుకుని దర్జాగా ప్రచారం సాగిస్తుండగా రాత్రిపూట తన వైపు ఓటర్లను తిప్పగలిగే వ్యక్తుల ఇళ్లకు వెళ్తున్నారు. ప్రతీ ఓటు కీలకమనే భావనలో ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తుండటంతో వారిని కలుసుకునేందుకు ప్రత్యేక సమయం తీసుకుంటున్నారు. ఇందుకోసం రాత్రి సమయంలోనూ ప్రచారం చేస్తున్నారు.
ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మద్యం ఏరులై పారుతోంది. ప్రచార పర్వానికి ముందే అభ్యర్థులు మందు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తమ తమ శిబిరాల్లో మందును ముందే తెప్పించి పెట్టారని చెప్తున్నారు. అలాగే స్థానిక వైన్‌షాపుల నుంచి కార్యకర్తలకు మందు ఇప్పించే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇస్నాపూర్ పరిధిలోని పాశమైలారం, రుద్రారం, లక్డారం, చిట్కుల్, బచ్చుగూడ, ముత్తంగి, ఇస్నాపూర్ పాత గ్రామాల్లో పాత ఓటర్లతో నేతలకు పెద్దగా చిక్కుల్లేవు. అయితే కొత్తగా పుట్టుకొచ్చిన కాలనీలతోనే సమస్యలు వచ్చాయి. కాలనీ ఓటర్లు తమ మనోగతం వెల్లడించడం లేదు. అలాగని ఏ పార్టీ అభ్యర్థులను కాదనడం లేదు. కాలనీల్లోని కొత్త ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు కౌన్సిలర్ అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. నిత్యం ప్రచార పర్వంలో పాల్గొంటున్న వారికి రోజుకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నారని మందు, భోజన సదుపా యాలు వేరేగా ఉన్నాయని ఇంకా ఓటర్లకు డబ్బులు పంచే ప్రక్రియ మొదలు కాలేదని చెప్తున్నారు.
ప్రతీ ఓటు కీలకమే


