ఏడేళ్లకొచ్చిన ఓట్ల పండుగ
ఐదు విలీన పంచాయతీల్లో కనిపిస్తోన్న ఎన్నికల హడావుడి
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణానికి సమీపంలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఏడేళ్ల తర్వాత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నగరా మోగిన వెంటనే గ్రామాల్లో సందడి కనిపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు జోరుగా ప్రచారం చేస్తుండటంతో జనంలో జోష్ కనిపిస్తుంది. జహీరాబాద్ పట్టణం చుట్టూ ఉన్న రంజోల్, అల్లీపూర్, చిన్నహైదరాబాద్, హోతి(కె) ఐదు గ్రామ పంచాయతీలున్నాయి. ఈ ఐదు పంచాయతీలను జహీరాబాద్ మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. గ్రామాల విలీనమైన తర్వాత 2019లో పురపాలక సంఘం ఎన్నికలు వచ్చాయి. తమ గ్రామ పంచాయతీని మున్సిపల్‌లో విలీనం చేయరాదని హోతి(కె) ప్రజలు కోర్టులో కేసు వేశారు. అప్పట్లో రాష్ట్రం అంతటా ఎన్నికలు జరగ్గా జహీరాబాద్ మున్సిపల్‌లో మాత్రం వాయిదా పడింది. దీంతో ఐదు పంచాయతీ గ్రామాల ఓటర్లు సుమారు ఏడేళ్ల నుంచి ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో ఆయా గ్రామ పంచాయతీల్లో రాజకీయ విరామం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈసారి ఐదు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి అభివృద్ధికి దూరంగా ఉన్న తమ గ్రామాల్లో ప్రగతి పనులు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పురపోరులో నామినేషన్, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం జోరుగా చేస్తున్నారు. దీంతో విలీన పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది.


