ఆ మూడింటిపై గురి..!
చైర్మన్ పీఠాల ఎంపికలో నిర్ణయాత్మకశక్తిగా మారే యోచన! ఐదు మున్సిపాలిటీల్లో 41 కౌన్సిలర్ స్థానాల్లో పోటీ కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన అధినేత అసదుద్దీన్
కోహీర్, జహీరాబాద్,
సంగారెడ్డిపై ఎంఐఎం నజర్
ఈ ఎన్నికల్లో ఎంఐఎం జిల్లాలో తన ఉనికిని మరోమారు చాటుకోవాలనుకుంటోందా? చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపికలో కీలకంగా మారాలని భావిస్తోందా? అందుకోసమే తమకు పట్టున్న మున్సిపాలిటీలపై గురిపెట్టి వ్యూహాత్మకంగా వెళుతోందా..? అంటే అవుననే సమాధానమే రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉండగా, ఐదు మున్సిపాలిటీల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. తమకు పట్టున్న వార్డులను ఎంపిక చేసుకుని మొత్తం 41 కౌన్సిలర్ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఒంటరిగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోకపోయినప్పటికీ, ఏదైనా పార్టీ అలయన్స్‌లో ఈ పీఠాలను కై వసం చేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళుతోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కొత్తగా మున్సిపాలిటీగా మారిన కోహీర్‌లో 16 వార్డులుండగా..6 చోట్ల ఎంఐఎం పోటీ చేస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కోహీర్‌లోని నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో రెండు ఎంపీటీసీ స్థానాలను ఈ పార్టీ గెలిచింది. ఇప్పుడు మున్సిపాలిటీగా మారడంతో కౌన్సిలర్ స్థానాలపైనా గురి పెట్టింది.
జహీరాబాద్ బల్దియాపైనా నజర్ వేసింది. 37 వార్డుల్లో 14 చోట్ల తమ అభ్యర్థులను దింపింది. 2010లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ ఇక్కడ మూడు కౌన్సిలర్ స్థానాలను కై వసం చేసుకోగా అంతకుముందు ఎన్నికల్లో ఏకంగా ఏడు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలిచారు. ఈ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో కొన్ని గ్రామాల్లోనూ ఆ పార్టీకి గట్టి పట్టుంది.
జిల్లా కేంద్రం సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులుండగా, 13 వార్డుల్లో మజ్లిస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ రెండు చోట్ల ఎంఐఎం గెలిచింది. అంతకుముందు ఎన్నిక ల్లో 14 మంది పోటీ చేస్తే ఎనిమిది కౌన్సిలర్ స్థానాలను కై వసం చేసుకుంది. గత ఎన్నికల కంటే ఎక్కు వ స్థానాలను గెలుచుకునేందుకు ఇప్పుడు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఈ మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాల ఎంపికలో నిర్ణయాత్మకంగా మారాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 15 వార్డుల్లో మూడు చోట్ల, సదాశివపేటలోని 26 వార్డులకు ఐదు వార్డుల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ మున్సిపాలిటీల్లో ఖాతా తెరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
కార్నర్ మీటింగ్‌లతో ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన మీటింగ్‌లో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొని సంగారెడ్డి జిల్లాలో తమ పార్టీని బలోపేతం చేస్తున్నామని ప్రకటించారు. అధికార కాంగ్రెస్ పార్టీనే ఆయన టార్గెట్ చేసిన అసదుద్దీన్ చైర్మన్, వైస్‌చైర్మన్ పీఠాలను గెలుచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని విమర్శించారు. జహీరాబాద్, కోహీర్‌లలోనూ కార్నర్ మీటింగ్ ఉంటాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద బల్దియా ఎన్నికల్లో సత్తాచాటేందుకు ఈ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది.


