
విద్యావంతులు, ఆర్థికంగా.. రెండు రకాలుగా బలమైన నేతలను బరిలోకి..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిత్వంపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. నాలుగు ఉమ్మడి జిల్లాలో ప్రభావితం చేయగల అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా ఉండటంతో అన్ని జిల్లాలను ప్రభావితం చేయగల సమర్థవంతమైన అభ్యర్థిని పోటీలో నిలపాలని భావిస్తోంది.
విద్యావంతులు, ఆర్థికంగా.. రెండు రకాలుగా బలమైన నేతలను బరిలోకి దింపాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా నలుగురి పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో పటాన్‌చెరుకు చెందిన పారిశ్రామికవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ సీహెచ్. అంజరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విద్యావంతుడు కావడంతో పాటు, ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఈ నేత పేరు పార్టీ అధినాయకత్వం పరిశీనలో ఉంది. అలాగే నిర్మల్ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర నేత సత్యనారాయణగౌడ్ పేరు కూడా వినిపిస్తోంది.
రాజకీయాల్లో సీనియర్ నేత అయిన సత్యనారాయణగౌడ్ వివాద రహితుడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలను కమలం పార్టీ కై వసం చేసుకున్న నేపథ్యంలో ఈ టికెట్‌ను ఇదే ప్రాంతానికి చెందిన నేతలకు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రదీప్‌రావు పేర్లు కూడా పార్టీ నాయకత్వం పరిశీలనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
ఓటరు నమోదుపై నజర్
ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్న పట్టభద్రుల ఓటరు నమోదు కొనసాగుతోంది. ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్న నేతలు ఓటరు నమోదుపై దృష్టి పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా తమకు అనుకూలంగా ఉండే పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమైన పట్టణాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థిత్వం ఖరారైతే మరింత విస్తృతంగా ఓటరు నమోదుపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. అయితే బీజేపీలో ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతోంది. కొన్ని రోజుల్లోనే ఈ అభ్యర్థిత్వంపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
విస్తృతమైన పరిధి..
ఈ నియోజకవర్గం పరిధి విస్తృతంగా ఉంది. ఈ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో మొత్తం ఆరు ఎంపీ నియోజకవర్గాలు, 43 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఈ స్థాయిలో ప్రభావితం చూపగల నాయకుడిని అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. అయితే చివరకు ఈ అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ ఇటు కమలం పార్టీలో నెలకొంది.