ఈడీ.. ఇటు చూస్తే..! | - | Sakshi
Sakshi News home page

ఈడీ.. ఇటు చూస్తే..!

Oct 23 2024 7:35 AM | Updated on Oct 23 2024 12:20 PM

రంగారెడ్డి జిల్లా అధికారులకు ఈడీ సమన్లు

రంగారెడ్డి జిల్లా అధికారులకు ఈడీ సమన్లు

అక్రమార్కుల్లో దడ

రంగారెడ్డి జిల్లా అధికారులకు ఈడీ సమన్లు

జిల్లాలోనూ భారీ భూ కుంభకోణాలు

అసైన్డ్‌ భూములను పట్టాదారు పాసుపుస్తకాలిచ్చేశారు

సర్కారు భూములను ధారాదత్తం చేశారని ఆరోపణలు

అధికారవర్గాల్లో అంతర్గత చర్చ

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో భూకుంభకోణాలకు పాల్పడిన అధికారుల్లో వణుకు మొదలైంది. విలువ చేసే ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించి పెద్ద మొత్తంలో దండుకున్న అక్రమారుల్లో ఆందోళన షురువైందనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో భూ కేటాయింపుల విషయంలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఓ అధికారికి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యేందుకు సహకరించిన కీలక ఉన్నతాధికారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వ భూములకు అన్యాక్రాంతం అయ్యేందుకు ఎన్‌ఓసీలు జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని మండలాల్లో రూ.వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు పరాధీనం కావడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈ అధికారులు కూడా రూ.కోట్లకు పడగలెత్తారు. బినామీ పేర్లతో విల్లాలు, భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

● కంది మండలంలోని 11 గ్రామాల పరిధిలోనే 518 ఎకరాల అసైన్డ్‌ భూమిని ధరణిలో పట్టాభూములుగా రికార్డులను మార్చేశారు. ఈ భూదందాను ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. వెంటనే తేరుకున్న అధికారులు ధరణి రికార్డులను సరిచేసి అసైన్డ్‌ భూములుగా రికార్డులను సరిచేశారు. హైదరాబాద్‌ ఐఐటీ, ఓఆర్‌ఆర్‌కు అతి సమీపంలో ఉన్న ఈ మండలంలో ఎకరం కనీసం రూ.ఐదు కోట్లు పలుకుతోంది. పట్టాభూములుగా మార్చడంలో వాటిలో వెంచర్లు వేసి ప్లాట్లు చేసి అక్రమార్కులు కోట్లు దండుకున్నారు. ఈ వ్యవహారాన్ని జిల్లాలో పనిచేసిన వెళ్లిన కీలక ఉన్నతాధికారులు వెనకుండి నడిపించారనేది బహిరంగ రహస్యంగా మారింది. ఇప్పుడు ఇలాంటి భూకుంభకోణాలపై ఈడీ దృష్టి సారించిందనే చర్చ జరుగుతోంది.

● పట్టా భూములను నయానోభయానో కొనుగోలు చేయడం.. ఆ పట్టా భూముల సర్వే నంబర్లతో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం అమీన్‌పూర్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి, జిన్నారం, కంది తదితర మండలాల్లో పరిపాటైపోయింది. పట్టాభూముల పేరుతో వెంచర్లకు, భవనాల నిర్మాణాలకు అనుమతులు తీసుకుని విలువైన ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టి కోట్లు గడించడం పరిపాటైపోయింది. ఇలా ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నప్పటికీ కళ్లు మూసుకున్నందుకు ఈ కీలక ఉన్నతాధికారులకు కాసుల వర్షం కురిసింది. జిన్నారం మండలంలో వారసులు లేని భూములను సైతం చాకచక్యంగా ధారాదత్తం చేశారు. బోగస్‌ వారసులను, వారికి బోగస్‌ ఆధార్‌కార్డులను సృష్టించి పట్టాలు మార్పిడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనూ ఈ అక్రమార్కులు అందిన కాడికి వెనుకేసుకున్నారు. మరోవైపు చెరువులు మింగేయడంలోనూ ఈ అక్రమార్కులు కబ్జాదారులకు వత్తాసు పలికారు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఇలా రూ.వేల కోట్లు విలువ చేసే భూదందాలను వెనకుండి నడిపించిన ఈ కీలక ఉన్నతాఽధికారుల్లో భయాందోళనలు షురువయ్యాయనే ఆసక్తికరమైన చర్చ రెవెన్యూ, ఇతర అధికార వర్గాల్లో జరుగుతోంది.

రామచంద్రాపురం మండలం కొల్లూరులో ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగేందుకు ఎన్‌ఓసీలు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉస్మాన్‌నగర్‌లో ఖరీజ్‌ ఖాతా భూములను అన్యాక్రాంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ గ్రామాలు కోకాపేట్‌కు అతి సమీపంలో ఉంటాయి. ఓఆర్‌ఆర్‌ పక్కనే ఉన్నాయి. ఐటీ కంపెనీలుండే ప్రాంతానికి కొద్ది దూరంలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ గ్రామాల్లో పదుల ఎకరాలను బడాబాబులకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమాయలో అప్పటి అధికారులు భారీగా వెనుకేసుకున్నారనే చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement