తంగేడు పువ్వప్పునే గౌరమ్మ | - | Sakshi
Sakshi News home page

తంగేడు పువ్వప్పునే గౌరమ్మ

Oct 10 2024 7:32 AM | Updated on Oct 10 2024 1:37 PM

దుబ్బాకలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

దుబ్బాకలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

నేడు సద్దుల బతుకమ్మ పండుగ 

ఆట పాటలతో హోరెత్తుతున్న పల్లెలు.. 

నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తి

దుబ్బాక: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంతి పూల తోట ఉయ్యాలో.. ఇద్దరక్కజెళ్లెల్లు ఉయ్యాలో.. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా బతుకమ్మ ఆటపాటలే కనిపిస్తున్నాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రకృతి సహజసిద్ధంగా లభించే గడ్డిపూలను దైవంగా కొలిచే సంస్కృతి ప్రపంచంలో తెలంగాణలో తప్ప మరెక్కడా కనిపించదు. పెత్తర అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణలో అతి పెద్ద పండుగ. ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల, ముద్దప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన బతుకమ్మ , వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, చివరగా సద్దుల బతుకమ్మతో పండుగా ముగుస్తుంది.

సద్దుల బతుకమ్మ ప్రత్యేకత..

బతుకమ్మ పండుగ చివరగా తొమ్మిదో రోజున సద్దులు (పెద్ద బతుకమ్మ)కు ఈ పండుగలో ప్రత్యేకత. మహిళలంతా నేడు ఘనంగా జరుపుకోనున్నారు. గునుగు పూలు, తంగేడు, బంతి, చిట్టి చామంతి, గడ్డిపూలతోపాటు వివిధ రకాల పూలతో అందంగా పోటాపోటీగా పెద్ద బతుకమ్మను పేర్చి, తోడుగా చిన్న బతుకమ్మ, పక్కనే గౌరమ్మను తయారు చేసి పూజిస్తారు. సద్దుల బతుకమ్మ పండుగకు ఎంత దూరంలో ఉన్న వారైనా తప్పకుండా సొంత గ్రామాలకు వచ్చి పండుగలో పాలుపంచుకుంటారు.

ఖండాంతరాలు దాటి

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ నేడు దేశ ఎల్లలు, ఖండాంతరాలు దాటి జరుపుకుంటున్నారు. విదేశాల్లో ఏళ్ల నుంచి స్థిరపడ్డ ప్రజలు బతుకమ్మ పండుగలను ఆయా దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. అమెరికా, ఇంగ్లాండ్‌, గల్ఫ్‌ దేశాల్లో, సింగపూర్‌తోపాటు చాలా దేశాల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకుంటుండటం విశేషం.

79 ఏళ్లయినా ఆడుతున్నా..

బతుకమ్మ చాలా గొప్ప పండుగ. ఆడపడుచుల ఆరాధ్య దైవం. బతుకమ్మ పండుగ వచ్చిందంటే మహిళలు, పిల్లలు చాలా సంబురపడుతారు. నేను ఇప్పుడు 79 ఏళ్లకు వచ్చిన, ప్రతీయేటా తప్పకుండా బతుకమ్మను పేర్చుతా. నా పిల్లలకు బతుకమ్మ పేర్చడం, పండుగ విశేషాలు నేర్పిన. నేను మా తల్లి గారిల్లు మిరుదొడ్డిలో పుట్టి పెరిగా, 12 ఏళ్ల వయస్సు నుంచే బతుకమ్మ ఆడుతున్నా.

– బిల్ల సరోజన, దుబ్బాక

ఘనంగా జరుపుకుంటాం

సద్దుల బతుకమ్మ పండుగను ప్రతీయేటా ఘనంగా జరుపుకుంటాం. సద్దుల బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలు అత్తగారింటి నుంచి తల్లి గారింటికి రావడంతో ఇండ్లన్నీ ఆడబిడ్డలు, పిల్లలతో కళకళలాడుతాయి. బతుకమ్మ పండుగ ప్రతీ సంవత్సరం చాలా సంతోషాన్ని నింపుతుంది.

– ఎర్రగుంట సుజాత, కవయిత్రీ లచ్చపేట

పెద్దగా పేర్చేటోళ్లం

మేము చిన్నతనంలో సద్దుల బతుకమ్మను చాలా పెద్దగా పేర్చేటోళ్లం. బతుకమ్మ పండుగకు ఒక రోజు ముందుగానే అడవికి పోయి మోపులకొద్ది గునుగ పువ్వు కోసుకొచ్చెటోళ్లం. ఇప్పుడు సద్దుల బతుకమ్మను చిన్నగా పేర్చుతుండ్రు.అ ప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది.

– స్వాతి, డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు

బతుకమ్మ ఆడుతున్న మహిళలు1
1/3

బతుకమ్మ ఆడుతున్న మహిళలు

● నేడు సద్దుల బతుకమ్మ  పండుగ ● ఆట పాటలతో  హోరెత్తుతున్న2
2/3

● నేడు సద్దుల బతుకమ్మ పండుగ ● ఆట పాటలతో హోరెత్తుతున్న

నేడు సద్దుల బతుకమ్మ  పండుగ 3
3/3

నేడు సద్దుల బతుకమ్మ పండుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement