యువతి అదృశ్యం | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Published Thu, Apr 18 2024 10:35 AM

- - Sakshi

శివ్వంపేట(నర్సాపూర్‌): యువతి అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్‌ మండలం మక్తమాసన్‌పల్లి గ్రామానికి చెందిన అక్షయతో శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌గౌడ్‌కు గత నెల 30న వివాహమైంది. ఈ నెల 14వ తేదీన అర్థరాత్రి అత్తగారింటి నుంచి అక్షయ వెళ్లిపోయింది. ఓ యువకుడి బైక్‌ పై వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. నవీన్‌గౌడ్‌ తండ్రి వెంకట్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపారు.

గుర్తు తెలియని

మృతదేహం లభ్యం

సిద్దిపేటకమాన్‌: ఆర్టీసీ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీసుల కథనం మేరకు.. వడదెబ్బకు గురై పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని, 5.2 ఎత్తు, చామన చాయ రంగుతో, తెలుపు రంగు షర్ట్‌, నలుపు రంగు పాయింట్‌ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తు పడితే డయల్‌ 100 లేదా సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

నకిలీ పత్రాలు సృష్టించి భూమి విక్రయం

నిందితుడి రిమాండ్‌

రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఒక వ్యక్తికి సంబంధించిన భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరులకు విక్రయించిన వ్యక్తిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. కొల్లూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరా బాద్‌లో నివాసం ఉండే మనోజ్‌కుమార్‌జైన్‌ తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్‌ 177లోని 2.27గుంటల భూమిని గతంలో ఆ భూమికి సంబంధించిన భూ యజమానులు ఇతరులకు విక్రయించారు. అయితే భూమిని విక్రయించారని తెలిసి కూడా మనోజ్‌కుమార్‌ జైన్‌ వారి కుటుంబ సభ్యులతో కుమ్ముకై నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఆ భూమిని మనోజ్‌కుమార్‌ జైన్‌ 2006లో తన పేరు పైన సేల్‌ డిడ్‌ చేసుకున్నాడు. ఆ డాక్యుమెంట్‌ను చూపించి 2023లో కమిడి రియాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు విక్రయించగా చుట్టూ ప్రహరీ నిర్మించారు. విషయం తెలుసుకున్న అసలు భూమి యాజమాని సుభాష్‌గౌడ్‌ కొల్లూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు మనోజ్‌ కుమార్‌ జైన్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

గృహోపకరణాలు దగ్ధం

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): విద్యుత్‌ హై ఓల్టేజీతో మండల పరిధిలోని ఆరూర్‌ గ్రామంలోని పలు వార్డుల్లో గృహోపకరణాలు బుధవారం దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఒక్కసారిగా హైఓల్టేజీ కరెంటు సరఫరా అయ్యింది. దీంతో పలు గృహాల్లో విద్యుత్‌ బల్బులు పేలిపోయాయి. ఫ్రిజ్‌లు, టీవీలు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్‌ సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 40 ఇళ్లలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు దగ్ధమైనట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

అక్షయ
1/1

అక్షయ

 
Advertisement
 
Advertisement