మృతదేహాల కలకలం! అస‌లేం జ‌రుగుతుంది? | Sakshi
Sakshi News home page

మృతదేహాల కలకలం! అస‌లేం జ‌రుగుతుంది?

Published Mon, Dec 18 2023 4:56 AM

- - Sakshi

సంగారెడ్డి: హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో తరచూ మృతదేహాలు లభ్యమవుతున్నాయి. మహిళలు, యువతుల, వ్య క్తుల మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మృతదేహం దొరుకుతుండడంతో పోలీసులకు సవాలుగా మారింది. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

హైదరాబాద్‌కు సమీపంలో జిన్నారం మండలంలోని బొల్లారం, గడ్డపోతారం, ఖాజీపల్లి, జిన్నారంమంగంపేట, సోలక్‌పల్లి గ్రామాలు, హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి, నాగారం, వడ్డెపల్లి, షేర్‌ఖాన్‌పల్లి గ్రామాలు, గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి, మంబాపూర్‌, నల్లవల్లి, కొత్తపల్లి, కొత్తపల్లి తండా గ్రామాలు ఉన్నాయి. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ అటవీ ప్రాంతం వేల హెక్టార్‌లో విస్తరించి ఉంది.

హైదరాబాద్‌ నుంచి నర్సాపూర్‌ వరకు ప్రధాన రహదారి ఉంది. ఈ రోడ్డుపై ప్రతీనిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మహిళలు, యువతులను హత్యలు చేసి అటవీ ప్రాంతాల్లోకి తీసుకొచ్చి కాల్చి పడేస్తున్నారు. ఇలాంటి కేసులు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వీటిని ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగానే మారింది.

  • రెండేళ్ల కిందట నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డబ్బాల్లో తీసుకొచ్చి నల్లవల్లి అటవీ ప్రాంతంలో పడేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది.
  • దుండిగల్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేసి మాదారం అటవీ ప్రాంతంలో పడేశారు. వారం రోజుల తర్వాత సమీపంలోని ప్రజలు చూడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏడాది క్రితం జరిగింది.
  • రెండేళ్ల కిందట ఇతర ప్రాంతంలో హత్య చేసిన వ్యక్తిని బొల్లారం సమీపంలోని రింగురోడ్డు ప్రాంతంలో పడేశారు.
  • ఖాజీపల్లి అటవీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు మూడు జరిగాయి.
  • ఆయా అటవీ ప్రాంతాల్లో పలువురు మహిళలు, యువకులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి హత్యలా, ఆత్మహత్యాలా తెలియరాలేదు.
  • మూడు నెలల కిందట ఓ మహిళ మృతదేహాన్ని మంబాపూర్‌ అటవీ ప్రాంతంలో పడేసి కాల్చి హత్య చేశారు.
  • తాజాగా జిన్నారం మండలంలోని మంగంపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
  • నాగారం, రొయ్యపల్లి, నర్సాపూర్‌ ప్రాంతాల్లో కూడా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

లోపించిన నిఘా..
ప్రధాన రహదారులపై పోలీసుల నిఘా లోపించింది. నామమాత్రంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాత్రి సమయంలో నిఘా లోపించడంతో నిందితులు దర్జాగా వారి పనులు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాల పనితీరు కూడా సరిగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తగిన నిఘా, భయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, వీటిని నివారించేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కేసులను ఛేదిస్తున్నాం..
హత్య కేసులను ఛేదించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా గట్టి నిఘా ఏర్పాటు చేశాం. హత్యలు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సీసీ కెమెరాల పనితీరును మరింత మెరగు పర్చేలా చూస్తున్నాం. – వేణుకుమార్‌, సీఐ జిన్నారం
ఇవి కూడా చ‌ద‌వండి: చిన్నారి పాలిట శాపంగా మారిన రాగిజావ!

Advertisement
 
Advertisement