
ప్రియాంకగాంధీకి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్, ప్రమీల దంపతులు
● చెరకు, నిమ్జ్ సమస్యలను పరిష్కరించేలా చూస్తా ● జహీరాబాద్ ప్రజలకు ప్రియాంకగాంధీ భరోసా
జహీరాబాద్: చెరకు రైతులు, నిమ్జ్ భూ బాధితుల సమస్యలను పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ జహీరాబాద్ ప్రజలకు భరోసా ఇచ్చారు. మంగళవారం పట్టణంలోని శ్రీనివాస్ థియేటర్ వద్ద నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్‌ను గెలిపించాలన్నారు. తాను జహీరాబాద్ వచ్చి చెరకు, నిమ్జ్ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. తమ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ సౌమ్యుడని, సహాయం చేసే గుణముందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి అన్నివిధాలుగా అండగా ఉంటుందన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో కూడా ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని తుంగలో తొక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని, వారు మాత్రమే లబ్ధిపొందారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాసంక్షేమం
కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ప్రియాంకగాంధీ అన్నారు. కర్ణాటక, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలే ఇందుకు నిదర్శనమన్నారు. తమ ప్రభుత్వం 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తుందన్నారు. ఇప్పటికై నా ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
21 నిమిషాల పాటు ప్రసంగం
ప్రియాంక గాంధీ జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో 21 నిమిషాల పాటు ప్రసంగించారు. అంతకు ముందు కాంగ్రెస్ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్ ప్రసంగించారు. ఉదయం 11.45 గంటలకు ప్రియాంకగాంధీ హెలీకాప్టర్ జహీరాబాద్‌కు చేరుకుంది. అనంతరం ఆమె వాహనంలో రోడ్‌షోలో పాల్గొనేందుకు బయలుదేరారు. రోడ్‌షోకు ప్రజలు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. 65వ జాతీయ రహదారికి ఇరువైపులా ప్రజలు చేరుకుని ఆమె ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. ప్రియాంకగాంఽధీకి కాంగ్రెస్ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్, ప్రమీల దంపతులు, పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, కర్ణాటక మంత్రి ఈశ్వర్‌ఖండ్రే, ఎంపీపీ అధ్యక్షుడు ఎన్.గిరిధర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎంజి రాములు, జి.అశోక్, ఖాజ స్వాగతం పలికారు.