
మాట్లాడుతున్న పవన్ కుమార్, శరత్
● ఎన్నికలపై నేతలు పూర్తి అవగాహనతో ఉండాలి ● జిల్లా జనరల్ అబ్జర్వర్ పవన్ కుమార్
సంగారెడ్డి టౌన్: జిల్లాలో శాసనసభ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా రాజకీ య పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా జనరల్ అబ్జర్వర్ పవన్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు, ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్, కలెక్టర్‌తో కలిసి ఆయన పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలని, పూర్తి అవగాహనతో నడుచుకోవాలని పొలిటికల్ పార్టీల ప్రతినిధులను కోరారు. జిల్లా ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ దయాళ్ గంగ్వార్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఏ విధంగా ఈ నిర్వహణ జరుగుతుందన్న విషయాన్ని పరిశీలించడానికి వచ్చామని చెప్పారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు కేపీ జయకర్ మాట్లాడుతూ, అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసా అభ్యర్థి వ్యయ రిజిస్టర్లో చూపాలని, షాడో రిజిస్టర్‌తో వెరిఫై చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పొలిటికల్ పార్టీల ప్రతినిధులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి శరత్ మాట్లాడుతూ, జిల్లాలో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశాలు, ఎన్నికల నియమావళి, ఎన్నికల ఖర్చుల నియంత్రణ పర్యవేక్షణ, సి–విజిల్, సువిధ యాప్, అభ్యర్థులు ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదన్న విషయాలపై పూర్తి అవగాహన కల్పించామని అబ్జర్వర్లకు వివరించారు. సమావేశంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు దీపక్ సింగ్లా, పవన్ కుమార్, వ్యయ పరిశీలకులు నాజీం జై ఖాన్, కే విజయ్ కృష్ణ వేలాన్, పోలీస్ అబ్జర్వర్ దయాల్ గంగ్వార్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్‌ఓ నగేశ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
ఐదు నియోజకవర్గాలకు ఎన్నికల సిబ్బంది
ఎన్నికల నేపథ్యంలో ఈనెల 30వ తేదీన జరిగే పోలింగ్‌కు సంబంధించి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అవసరమైన పోలింగ్ అధికారులు, సిబ్బంది కేటాయింపు పూర్తయిందని శరత్ తెలిపారు. రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియను మంగళవారం ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. యూత్ మేనేజ్మెంట్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతోపాటు మోడల్ పోలింగ్ కేంద్రాలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు అబ్జర్వర్లకు వివరించారు.
26 వేల ఎంటీల ధాన్యం కొన్నాం
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లు నిర్ణీత గడువులోగా సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) డెలివరీ పూర్తి చేయా లని మిల్లర్లను ఆదేశించారు. ఇప్పటివరకు 26 వేల మెట్రిక్ టన్నుల(ఎంటీ) ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.