
● ప్రజలకు సేవలందించిన వ్యక్తి చింతా ప్రభాకర్ ● కాంగ్రెసోళ్లకు ఒక్క చాన్స్ ఎందుకివ్వాలి? ● బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ● బీఆర్‌ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో రోడ్ షో, భారీ ర్యాలీ
రోడ్ షో
సంగారెడ్డి: సంగారెడ్డికి మెట్రో రైలు, ఐటీ హబ్ నిర్మాణం జరగాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను గెలిపించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం కంది నుంచి సంగారెడ్డి వరకు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ మధ్య రోడ్ షో గంజిమైదాన్ వరకు చేరుకొని ముగిసింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లా డారు. ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ సన్నాసులకు ఒక్క చాన్స్ ఎందుకివ్వాలి? అని ప్రశ్నించారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి తాను గెలుస్తానని, బీఆర్‌ఎస్‌లో చేరుతానని చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే చింతా ప్రభాకర్‌కు టికెట్ ఎందుకు ఇస్తామని, గెలిపించమని ఎందుకు కోరుతామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ప్రభాకర్ ప్రజలకు సేవలందించారని, జగ్గారెడ్డి మాత్రం హైదరాబాద్‌కు పారిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌తోనే పంచాయితీ ఉందని, బీజేపీ ఖతమైందని పేర్కొన్నారు. ఇప్పుడు జరిగిన భారీ బైక్ ర్యాలీ, రోడ్ షోను చూస్తే ప్రభాకర్ గెలుపు తేలికవుతోందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలో వచ్చిన వెంటనే కేసీఆర్ భరోసా పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. రూ.400కే సిలిండర్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని వివరించారు. అనంతరం బీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, ఆరోగ్య బాగా లేకపోయినప్పటికీ ప్రజలందరూ తన కోసం పూజలు, ప్రార్థనలు చేశారని ఇది మరవబోనని చెప్పారు. గెలిచిన తర్వాత సేవ చేసుకొని వారి రుణం తీర్చుకుంటానన్నారు. తాను ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్నానని, వారి దీవెనలే శ్రీరామరక్ష అన్నారు. రాష్ట్రం మొత్తం సంగారెడ్డి వైపు చూస్తోందన్నారు.దేశంలో గుణాత్మక మార్పును తెచ్చిన ఏకై క వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్, నాయకులు డాక్టర్ శ్రీహరి, మామిళ్ల రాజేందర్, కాసాల బుచ్చిరెడ్డి, ముఖీం, పెరమాండ్ల నర్సింలు, ఆర్.వెంకటేశ్వర్లు, సాబేర్ తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతున్న కేటీఆర్, కార్యక్రమానికి హాజరైన జనం
