జిల్లాలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్య, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షల నిర్వహణకు 118 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 21,413 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మ.12.30 వరకు జరుగుతాయని, విద్యార్థులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకునేలా చూడాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో వేసవి దృష్టా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఓఅర్‌ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా రూట్ల వారీగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వాణి విశ్వనాథ్, ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారి విజయ, అసిస్టెంట్ ఎగ్జామినేషన్స్ అధికారి మణిదీపిక, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శరత్