
డిజిటల్ చెల్లింపుల్లో సరికొత్త ట్రెండ్
ఖర్చుల కోసం స్వల్పకాలిక రుణం
సులభ వాయిదాల్లో చెల్లింపులు
‘ఫి’కామర్స్ తాజా నివేదికలో వెల్లడి
ఫిన్‌టెక్ రంగంలో ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, ప్రభుత్వ చొరవ.. వెరసి భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా మారుతోంది. డిజిటల్ పేమెంట్స్‌లో క్రెడిట్ (రుణ) ఆధారిత చెల్లింపుల వాటా దాదాపు మూడింట ఒకవంతుకు చేరడం విశేషం. ఒకేసారి చెల్లింపులు చేయడం కంటే రుణాలను సులభ వాయిదాల్లో చెల్లించడానికే కస్టమర్లు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
క్రెడిట్ కార్డులు లేదా వడ్డీతో కూడిన ఈఎంఐల ద్వారా పేమెంట్స్ కానిచ్చేస్తున్నారని ఫిన్‌టెక్ కంపెనీ ‘ఫి’కామర్స్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 20,000 మందికిపైగా వ్యాపారుల నుంచి విశ్లేషించిన లావాదేవీల సమాచారం ఆధారంగా భారత్‌లో 2024లో జరిగిన చెల్లింపుల తీరుతెన్నులపై ఈ నివేదిక రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. -సాక్షి, స్పెషల్ డెస్క్
అధిక విలువకు క్రెడిట్..
చిన్న, మధ్యస్థ విలువ కలిగిన లావాదేవీలలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధిపత్యం చెలాయిస్తుండగా.. అధిక విలువ కలిగిన కొనుగోళ్లు ఎక్కువగా క్రెడిట్ కార్డులు, ఈఎంఐల (నెలవారీ సులభ వాయిదాలు) ద్వారా జరుగుతున్నాయి.అంటే అధికంగా ఖర్చు చేయాల్సిన సందర్భాల్లో వినియోగదారులు స్వల్పకాలిక రుణాలపై ఆధారపడుతున్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వాహనాలు, వాహన అనుబంధ రంగాలు డిజిటల్ క్రెడిట్ స్వీకరణలో బలమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి.
పండుగ షాపింగ్, పాఠశాల అడ్మిషన్లు, కాలానుగుణ పోకడలు క్రెడిట్ వినియోగంలో పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 2024లో జరిగిన రోజువారీ మొత్తం చెల్లింపులలో లావాదేవీల సంఖ్య పరంగా యూపీఐ 65 శాతం వాటాతో తన హవాను ప్రదర్శిస్తోంది. ఈఎంఐలు 20%, క్రెడిట్ కార్డ్స్10%, నెట్ బ్యాంకింగ్ 3%, నేరుగా బదిలీ 2% నమోదయ్యాయి.