కాఫీ.. టీతో క్యాన్సర్‌కు చెక్‌...! | Check cancer with coffee and tea | Sakshi
Sakshi News home page

కాఫీ.. టీతో క్యాన్సర్‌కు చెక్‌...!

Jan 29 2025 5:44 AM | Updated on Jan 29 2025 5:44 AM

Check cancer with coffee and tea

అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ అధ్యయనంలో వెల్లడి

25వేల మంది అభిప్రాయాల సేకరణ

కెఫెన్‌ ఉన్న కాఫీ తాగడం వల్ల తల, మెడ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 17% తక్కువ

అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ అధ్యయనం

తల, మెడ క్యాన్సర్‌... ప్రపంచవ్యాప్తంగా ఏడో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా వైద్యు­లు చెబుతున్నారు. ధూమ­పానం, మద్యపానం అల­వా­ట్లు ఎక్కువగా ఉన్న వారిలో ఈ క్యాన్సర్‌ వ­చ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటు­న్నారు. అయితే, రోజూ నాలుగు కప్పుల కాఫీ లేదా టీ తాగిన వారిలో ఈ క్యాన్సర్‌ ముప్పు తగ్గే అవకాశం ఉందని అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ ఫర్‌ రివ్యూడ్‌ జర్నల్‌ వెల్లడించింది. ఇంటర్‌నే­షనల్‌ హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌ ఎపిడి­మియాలజీ కన్సార్టియంతో అనుసంధానమైన శాస్త్రవేత్తలు సుమారు 14 అధ్యయనాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసిన్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది.

‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ...’ అన్నాడో సినీ రచయిత. చాలామందికి తమ దైనందిన జీవితం కాఫీతో మొద­ల­వుతుంది. కొందరికి ఉదయం కాఫీ/టీ తాగకపోతే అసలు ఏ పనీ జరగదు. అంతలా అవి మన దైనందిన జీవితంలో భాగమ­య్యాయి. 
కొందరు కాఫీ, టీ తాగడం మంచిది కాదని చెబుతున్నా... అమెరికన్‌ కాన్సర్‌ సొసైటీ మాత్రం కాఫీ, టీలు క్యాన్సర్‌ నుంచి రక్షిస్తాయని చెబుతోంది.  – ఏపీ సెంట్రల్‌ డెస్క్‌

పరిశోధన ఇలా...
సుమారు 25వేల మందికిపైగా వ్యక్తుల నుంచి సేకరించిన డేటా ప్రకారం.. కాఫీ/టీ తాగడం వల్ల ఉత్సాహంగా ఉండటమే కాకుండా తల, మెడ క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్నవారు రోజు­/వా­రం/నెల/సంవత్సరానికి.... కెఫెన్‌ లేని కాఫీ, టీని తీసుకోగా వచ్చిన డేటా ఫలితాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

ఇదీ డేటా..
తల, మెడ క్యాన్సర్‌తో బాధప­డుతున్న 9,548 మంది, క్యాన్సర్‌ లేని 15,783మందిపై పరిశోధనలు చేయగా... కాఫీ తాగని వారితో పోలిస్తే రోజూ 4 కప్పులు కంటే ఎక్కువ కెఫెన్‌ ఉన్న కాఫీ తాగే వ్యక్తుల్లో తల, మెడ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 17% తక్కువగా ఉన్నట్లు కనుగొ­న్నారు. అలాగే నోటికుహరంలో క్యాన్సర్‌ వచ్చే అవకాశం 30% తక్కువని, గొంతు క్యాన్సర్‌ వచ్చే అవకాశం 22% తక్కువని తేలింది.

ఇక రోజూ 3–4 కప్పుల కెఫెన్‌ ఎక్కువ ఉన్న కాఫీ తాగడం వల్ల హైపోఫారింజియల్‌ క్యాన్సర్‌ (గొంతు దిగువన ఉండే ఒక రకమైన క్యాన్సర్‌) వచ్చే ప్రమాదం తక్కువని తేలింది. అలాగే కెఫెన్‌ లేని కాఫీ తాగడం వల్ల నోటి కుహర క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 25% తక్కువని, టీ తాగడం వల్ల హైపోఫారింజియల్‌ క్యాన్సర్‌ 29% తక్కువ వచ్చే అవకాశం ఉందని శాస్త్ర­వేత్తలు చెబు­తు­న్నా­రు.

కాగా, 1 కప్పు లేదా అంత­కంటే తక్కువ టీ తాగడం వల్ల తల, మెడ క్యా­న్సర్‌ వచ్చే ప్ర­మాదం 9% తక్కువని, హై­పోఫారింజియల్‌ క్యాన్సర్‌ వ­చ్చే ప్రమాదం 27% తక్కువగా ఉంటుందంటు­న్నారు. ఇలా ఉంటే, అధిక కాఫీ వినియోగం పలు రకాల క్యా­న్సర్ల ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించడంలో మేలు చేసినా, ఇందుకు మరింత పరిశోధన అవ­సర­మని నివేదికలో పేర్కొన్నారు. క్యాన్సర్‌ తగ్గించుకునేందుకు కాఫీ, టీలు తాగడం మాత్రమే పరిష్కారం కాదనీ, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామాలు, వైద్య­పరీక్షలు ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement