బెంగళూరులో వినూత్న ప్రయోగం... | Bengaluru Traffic Police Launches Traffic Cop For A Day Program To Let Citizens Experience Traffic Management Firsthand | Sakshi
Sakshi News home page

ఏక్‌ దిన్‌ కా ట్రాఫిక్‌ పోలీస్‌!

Nov 8 2025 12:18 PM | Updated on Nov 8 2025 3:12 PM

జాయింట్‌ కమిషనర్‌ కార్తీక్‌ రెడ్డి

గరాల్లోని అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌ను చూసి మీరెప్పుడైనా తిట్టుకున్నారా? పోలీసులు ఏం చేస్తున్నారని కసురుకున్నారా? చలాన్లతో వేధించడమే వారికి పని అని అనుకున్నారా?. అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. 

ఏటికేడాదీ పెరిగిపోతున్న వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా రోడ్లు, రవాణా సౌకర్యాలు మెరుగు కాకపోవడంతో మహా నగరాల్లో ట్రాఫిక్‌ నరకప్రాయం అవుతున్న సంగతి తెలిసిందే. కిలోమీటరు దూరం ప్రయాణించేందుకు కూడా గంటల సమయం పట్టే సందర్భాలు తరచూ ఎదురవుతూంటాయి. వర్షమొచ్చిందంటే ఇక అంతే సంగతి. నగరాలు చెరువులైపోతాయి. ఎన్ని మెట్రోలు, బస్సులు, రైళ్లు ఉన్నా.. స్తంభించిపోతాయి. ఆకస్మిక ట్రాఫిక్‌ జామ్‌లు, వీవీఐపీల టూర్లు వాహనదారులను విసిగించడమూ కద్దు. అయితే.. దిగితే కానీ లోతు ఎంతో తెలియదని తెలుగు సామెత. ట్రాఫిక్‌ పోలీసుల విషయమూ అంతే. ఒకసారి వాళ్లు ఎలా పనిచేస్తున్నారన్నది తెలుసుకుంటే కానీ వారి సాధకబాధకాలు, కష్టనష్టాలు తెలియవు. ఇప్పటివరకూ మనలాంటి వారికి ఆ అవకాశం లేకపోయింది కానీ.. బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులిప్పుడు ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ట్రాఫిక్‌ కాప్‌ ఫర్‌ ఏ డే’ పేరుతో ఆసక్తికలిగిన ప్రజలు ఒక రోజుపాటు ట్రాఫిక్‌ నియంత్రణలో పాలుపంచుకునేలా చేస్తున్నారు. ఈ కొత్త కార్యక్రమం వివరాలను బెంగళూరు నగర ట్రాఫిక్‌ విభాగం ఎక్స్‌ వేదికగా అందరితో పంచుకుంది. ఈ ట్వీట్‌లో జాయింట్‌ కమిషనర్‌ కార్తీక్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్యను వీలైనంత తగ్గించేందుకు ఏం చేస్తున్నామో ప్రజలకు ప్రత్యక్షంగా వివరించేందుకు ఉద్దేశించింది ఈ కార్యక్రమం’’ అని వివరించారు.

 

 

అవగాహనతో మొదలు..

 

ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నింటికంటే ముందుగా బెంగళూరు ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం పనితీరును వివరిస్తారు. ఆ తరువాత నగరంలోని అత్యంత బిజీ కూడళ్లలో ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది. పాదాచారులు రోడ్డు క్రాస్‌ చేసేందుకు సాయపడటం, వాహనాల రాకపోకలకు సిగ్నల్స్‌ ఇవ్వడం వంటివి చేస్తారు. అంతేకాకుండా... తాము పనిచేసిన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను మెరుగుపరిచేందుకు ఏవైనా ఆలోచనలు ఉంటే వాటిని కూడా పంచుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు "ASTraM" అప్లికేషన్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి. పద్దెనిమిదేళ్ల పైబడ్డ బెంగళూరు నగర నివాసులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరం, అభ్యర్థి ఆసక్తి, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి ముందుగా భద్రత నియమాలు, ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించిన ప్రాథమిక అంశాలను వివరించి ఆ తరువాత విధుల్లోకి తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ అనుభవాలను సోషల్‌మీడియా ద్వారా ఇతరులతో పంచుకునేలా చేయడం ద్వారా మరింత మందికి ట్రాఫిక్‌పై అవగాహన పెరుగుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్యను ప్రజలతో కలిసి పరిష్కరించేందుకు, రహదారి భద్రతను పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement