కడితేనే రిజిస్ట్రేషన్ను! | - | Sakshi
Sakshi News home page

కడితేనే రిజిస్ట్రేషన్ను!

Nov 19 2026 1:48 PM | Updated on Nov 19 2026 1:48 PM

ప్రజలపై పెను భారం

ఖాళీ స్థలానికీ పన్ను ..

తుర్కయంజాల్‌: జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల పరిధిలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు పన్నుపోటు పడనుంది. ఖాళీగా ఉన్న ప్లాట్లకు సంబంధించిన నిర్ణిత రుసుం చెల్లిస్తేనే ఇకనుంచి రిజిస్ట్రేషన్లు కానున్నాయి. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌ చట్టం) 2026లోని సెక్షన్‌ 98 ప్రకారం ఆస్తికి సంబంధించి బకాయి చెల్లించిన తర్వాతే ఈప్రక్రియ పూర్తవుతుంది. ఖాళీ స్థలాలకు వెకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ (వీఎల్‌టీ), నిర్మాణం పూర్తయినా లేదా నిర్మాణ దశలోనే ఇళ్లకు పీటీఐఎన్‌ నంబర్‌ తప్పనిసరి చేశారు. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్‌లు స్థలం, ఇంటికి ఆస్తి పన్ను అంచనా వేసి, బకాయిని రిజిస్ట్రేషన్‌ సమయంలోనే నిర్ణయించనున్నారు. ఇలా విధించిన పన్నులను పూర్తిగా చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. చెల్లించని వాటి రిజిస్ట్రేషన్లను ఈ నెల 12వ తేదీ నుంచి నిలిపివేయడంతో ప్లాట్ల యజమానుల్లో గందరగోళం నెలకొంది.

2021 నవంబర్‌కు ముందు

జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల పరిధి ఖాళీ స్థలాలకు విధించే పన్నునే వెకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ అంటారు. మార్కెట్‌ విలువ ఆధారంగా ఏడాదికి 0.5 శాతం పన్ను విధించనున్నారు. 2021 నవంబర్‌ నుంచి రిజిస్ట్రేషన్ల సమయంలో వీఎల్‌టీ నంబర్‌ జారీ చేస్తున్నారు. ఇలాంటి నంబర్లు పొందిన వారు ఇప్పటి వరకు పెండింగ్‌ వీఎల్‌టీ పన్ను పూర్తిగా చెల్లించాల్సి ఉంది. అంతకు ముందు రిజిస్ట్రేషన్లు జరిగినా వాటికి ఈ నంబర్‌ లేదు. వీఎల్‌టీ నంబర్‌ లేని వారు ముందుగా జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ సేల్‌ డీడ్‌, లింక్‌ డాక్యుమెంట్స్‌, తాజా ఈసీ, మార్కెట్‌ విలువ పత్రం, ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతి ఉంటే దాని కాపీని అప్‌లోడ్‌ చేసి, దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డాక్యుమెంట్‌ రైటర్లు స్లాట్‌ బుక్‌ చేసే సమయంలో వీఎల్‌టీ, పీటీఐఎన్‌ నంబర్‌, పన్ను విధింపు కోసం దరఖాస్తు చేస్తారు. అనంతరం స్థానిక సంస్థల సిబ్బంది పరిశీలించి పన్ను విధించి, నంబర్‌ జారీ చేస్తారు.

48 పని గంటల్లో జారీ

కొత్త చట్టం ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వాటికి రెండు రోజులు లేదా 48 పని గంటల సమయంలోనే జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల అధికారులు విచారణ జరిపి ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలనే నిబంధన ఉంది. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తు ఆధారంగా అధికారులు ప్లాట్‌ వద్దకు వెళ్లి, ఆ భూమి రెసిడెన్షియల్‌, కమర్షియల్‌, కన్జర్వేషన్‌ జోన్‌లో ఉందా..? లేదా ప్రభుత్వ భూమి, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉందా నిర్ణయించాల్సి ఉంటుంది. విచారణ తర్వాత అంతా స్థానిక సంస్థల అధికారులు దరఖాస్తును అప్రూవల్‌ చేస్తారు. అర్జీదారులను రోజుల తరబడి నిబంధనల పేరుతో కార్యాలయాల చుట్టూ తిప్పుకొనే అధికారులకు ఇది కొంత మేర ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే నిర్ణయించిన 48 గంటల్లో పని పూర్తి చేయకపోతే నేరుగా.. డీమ్డ్‌ అప్రూవల్‌ వెళ్లనుంది. ఇలా డీమ్డ్‌ అప్రూవల్‌ వెళితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి.

2007– 08 నుంచి..

ఇదే విషయమై ఆదిభట్ల సర్కిల్‌ అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు వివరణ కోరగా.. ప్రస్తుతం 2007– 08 నుంచి ఈ పన్ను విధిస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ఆధారంగా ట్యాక్స్‌ విధిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్త చట్టంలో ఈ నిబంధనను చేర్చడంతో వీఎల్‌టీ, పీటీఐఎన్‌ నంబర్‌ పొంది, పూర్తిగా బకాయి చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్‌ చేయడానికి అవకాశం ఉందని వనస్థలిపురం సబ్‌ రిజిస్ట్రార్‌ తెలిపారు.

క్యూర్‌ చట్టం అమలుతో ప్లాట్ల యజమానులకు అవస్థలు

2021 నవంబర్‌ నుంచి ప్రతీ రిజిస్ట్రేషన్‌కు వీఎల్‌టీ నంబర్‌ జారీ

అంతకుముందే రిజిస్ట్రేషన్లు పూర్తయిన ప్లాట్లకు మరింత భారం

గతంలోనూ వీఎల్‌టీ నిబంధనలు ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. రిజిస్ట్రేషన్‌ సమయంలో లేదా ఇంటి నిర్మాణ అనుమతి సమయంలో దీనికి విధించేవారు. కానీ ప్రస్తుతం ఎన్ని ఏళ్ల నుంచి ప్లాట్‌ ఖాళీగా ఉంది అనే వివరాల ఆధారంగా పన్ను విధిస్తుండటం, అది పూర్తిగా చెల్లించాకే రిజిస్ట్రేషన్‌ అనే నింబంధన అమల్లోకి రావడంతో ప్రజలపై పెను భారం పడుతోంది. ప్లాట్ల యజమానులకు ఒక వైపు ఎల్‌ఆర్‌ఎస్‌, ఇంటి నిర్మాణ అనుమతులకు ఖాళీ స్థలం పన్ను తోడవడం గుది బండగా మారింది. ఖాళీ స్థలం ఉన్నందుకు మార్కెట్‌ విలువ ఆధారంగా పన్ను చెల్లించాల్సి రావడంతో.. రూ.వేలల్లో కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నిర్ణయంపై చాలా మంది ప్లాట్ల యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టి ప్లాట్‌ కొనుగోలు చేసిన తరువాత, ఇళ్లు కట్టుకునే స్థోమత లేకపోవడంతో ప్లాట్‌ను ఖాళీగా వదిలేస్తే.. దానికి పన్ను చెల్లించాలి అనే నిబంధన తేవడం, అది కూడా ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని చెల్లించాలనడం సరైంది కాదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement