శంకర్‌పల్లి: ఓ ఫర్నిచర్ దుకాణంలో బుధవారం వేకువజామున 3గంటలకు విద్యుదాఘాతం సంభవించింది. దుకాణంలోని ఫర్నిచర్ అగ్నికి ఆహుతి కాగా.. లోపల ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాధిత యజమాని, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌కు చెందిన సద్దాం మాలిక్(30) బతుకుదెరువు నిమిత్తం రెండేళ్ల క్రితం శంకర్‌పల్లి మండలానికి వచ్చాడు. దొంతాన్‌పల్లిలో ఏ– 1 ఫర్నిచర్ దుకాణం ఏర్పాటు చేసుకుని, పక్కనే ఉన్న మహారాజ్‌పేట్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. బుధవారం వేకువజామున 3గంటలకు దుకాణంలో విద్యుదాఘాతం ఏర్పడింది. దుకాణంలో పెద్ద మొత్తంలో కర్ర, ప్లాస్టిక్‌తో తయారు చేసిన సోఫాలు, కుర్చీలు, మంచాలు ఉండడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. పక్కనే ఉన్న బాయ్స్ హాస్టల్, పెయింట్స్ దుకాణానికి సంబంధించిన కిటీకిలు కాలిపోయాయి. వారు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పారు. స్థానికుల సమాచారంతో చేవెళ్ల నుంచి రెండు ఫైర్ ఇంజిన్లు వచ్చి, మంటలను అదుపులోకి తీసుకుని వచ్చాయి. ప్రమాదంతో సుమారు రూ.50 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. తనకు జీవనాధారం ఇదేనని, షాపునకు ఇన్సూరెన్సు సైతం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మంటలు అంటుకుని సోఫాలు, కుర్చీలు, సామగ్రి దగ్ధం
రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం
కేసు నమోదు చేసిన శంకర్‌పల్లి పోలీసులు


