షాబాద్: షాబాద్‌ను వంద శాతం అక్షరాస్యత కలిగిన మండలముగా తీర్చిదిద్దే దిశగా పనిచేయాలని జిల్లా వయోజన విద్య ఉప సంచాలకులు అనిత పేర్కొన్నారు. ఐదు రోజుల్లో నిరక్షరాస్యులను గుర్తించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వీబీ రామ్‌జీ ఫీల్డ్ సిబ్బంది, వీఓఏఎస్, ఎస్‌ఈఆర్‌పీ సీసీలకు సర్వే ఫారాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో ప్రతీ ఇంటిని సర్వే చేసి నిరక్షరాస్యులను గుర్తించాలన్నారు. ఇందుకోసం స్థానిక సర్పంచ్‌ల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అంకమరాజు, ఎంపీడీఓ అపర్ణ, సర్పంచులు, పంచాయతీ కార్దర్శులు, తదితరులు ఉన్నారు.
ఇబ్రహీంపట్నం: వినోబానగర్‌లోని ఆక్టోపస్ కమాండో ట్రైనింగ్ సెంటర్ ప్రాంగణంలో ఈ నెల 21న పాత వస్తువుల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సెంటర్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత బ్యాటరీలు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువులు, ఇనుప సామగ్రి, దుస్తులు, నిరుపయోగమైన కంప్యూటర్లు, ఆపరేషనల్ పరికరాలు, ఆట వస్తువులు తదదిత రకాల పాత వస్తువులను వేలం పాటలో విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. అసక్తి ఉన్నవారు గురు, శుక్రవారాల్లో వస్తువులను పరిశీలించుకోవచ్చునని తెలిపారు. వేలంలో దక్కించుచుకున్న వస్తువులకు వెంటనే నగదు చెల్లించాలని సూచించారు.
షాబాద్: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా కల్పిస్తోందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి అంకమరాజు పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో క్యాంప్ ఇన్‌ఛార్జ్‌లు, సూపర్‌వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, మండల అధికారులు, గ్రామ సర్పంచులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గురువారం నుంచి ఈ పథకం ప్రారంభం కానుందని వివరించారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షాబాద్ ఎంపీడీఓ అపర్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.
ఎస్పీ స్నేహమెహ్ర
పరిగి: నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్నేహమెహ్ర సూచించారు. బుధవారం ఆమె పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. కేసుల దర్యాప్తుపై సమీక్ష చేశారు. పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ఆస్తి, మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసులపై దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి బాధితులకు సహాయం చేయాలని సూచించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణ, విక్రయంపై నిఘా పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యమైన ప్రదేశాల్లో గస్తీని ముమ్మరం చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, పరిగి సీఐ కొండల్‌రెడ్డి, ఎస్సై మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


