ఇంటిపై సౌర పలక విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటు ఉపయుక్తంగా మారనుంది.
● నేటినుంచే అమలు
● కలెక్టర్ నారాయణరెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, కుటుంబాల ఆర్థిక భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని’ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లాలో సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కాబోతోందని, దీని ద్వారా ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ ఉంటుందని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. 18నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టంచేశారు. దీనిపై అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఈ పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలు, అర్హత ప్రమాణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు పథకంపై ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని వెంటనే నివృత్తి చేస్తూ, పథకం వివరాలు ప్రజలకు చేరేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రధాన కార్యదర్శితో కాన్ఫరెన్స్
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులందరికీ అందేలా చూస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ కుటుంబంలోని యజమానిని బీమా పరిధిలోకి తీసుకురావాలని సంజయ్‌జాజు సూచించారు. సదరు వ్యక్తి వయసు 18 నుంచి 59 సంవత్సరాలోపు ఉండేలా చూసుకోవాలన్నారు. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, కులమతాలకు అతీతంగా ప్రతీ కుటుంబానికి ఈ పథకం చేరాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిరణ్మయి, సీపీఓ సౌమ్య, డీఆర్‌డీఓ శ్రీలత, మెప్మా పీడీ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.


