ఒకప్పుడు దేశీయ నగరాలపై ఆసక్తి ప్రస్తుతం విదేశీ టూర్ల వైపు మొగ్గు ఆకర్షిస్తున్న అక్కడి సిటీలు..ప్రత్యేక ప్యాకేజీలు సెలవులొస్తే చాలు చలో అంటున్న కుటుంబాలు
ఒకప్పుడు వినోదం.. ఆహ్లాదం పంచే టూర్లంటే గోవా.. కశ్మీర్.. ఊటీ.. కొడైకెనాల్ వంటి దేశీయ నగరాలు గుర్తుకువచ్చేవి.. రానురాను ట్రెండ్ మారుతోంది.. గ్రామీణ ప్రాంతాలు మొదలు పట్టణ ప్రాంతాల వరకు జనం గేరు మార్చారు.. దేశాన్నే కాదు..విదేశాలను సైతం చుట్టేదాం అంటూ ముందుకు సాగుతున్నారు. విదేశాలకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీలు.. అందుబాటులో విమానయాన చార్జీలు.. సోషల్ మీడియాలో విదేశాల్లో ఉన్న ఆసక్తికరమైన ప్రదేశాల గురించి వీడియోలు ఇటువైపు నడిపిస్తున్నాయి.. దీంతో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
షాద్‌నగర్: యాత్రల విషయంలో అందరి అభిరుచుల్లో మార్పు కనిపిస్తోంది.. చాలా మంది సకుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్తున్నారు. ఇక యువకులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారులు చేసే విదేశీ ప్రయాణాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కువ శాతం మంది థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంక, సింగపూర్, మలేషియా, దుబాయ్ లాంటి దేశాలకు పయనమవుతున్నారు. గతంలో ఆర్థికంగా బలంగా ఉన్న వారు మాత్రమే విదేశాలకు వెళ్లే వారు. ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామీణప్రాంతాల వారు కూడా విదేశాలకు వెళ్లడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. సెలవులు వచ్చాయంటే చాలు గ్లోబల్ బీచ్‌లకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారం
విదేశీ యాత్రలపై ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా. వివిధ దేశాలు, అక్కడ ఉండే సుందరమైన ప్రదేశాలు, అందాలు, అక్కడికి వెళ్లడానికి ఉన్న మార్గాల గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా ప్రాంతాలను చూడాలన్న ఆసక్తి జనంలో పెరుగుతోంది. దీనికి తోడు పర్యాటక సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నాయి. వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఆయా సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు టార్గెట్లు విధించి పూర్తి చేసిన వారిని విదేశాలకు తీసుకెళ్తున్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు హనీమూన్ కోసం విదేశీ టూర్లపై ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. సెలువులు వచ్చాయంటే చాలు చాలా కుటుంబాలు తమకు నచ్చిన స్థలాలను ఎంపిక చేసుకొని వీసాలు తీసుకొని, టికెట్లు బుక్ చేసుకొని విదేశాలకు వెళ్తున్నారు. దేశీయ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుతోనే కొన్ని విదేశీ టూర్ ప్యాకేజీలు అందుబాటులో వస్తుండటంతో పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు.
తక్కువ ప్యాకేజీలో..
ట్రావెల్‌సంస్థల లెక్కల ప్రకారం ఒక మధ్యతరగతి కుటుంబం కశ్మీర్, కేరళ, ఊటీ వంటి పర్యటనకు వెళ్లేందుకు విమాన టికెట్లు, హోటల్ వసతి, ఇతరు ఖర్చులు కలిపి ఒక్కొక్కరికి రూ.40వేల వరకు ఖర్చవుతుంది. కాస్త అటు ఇటుగా థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, దుబాయ్ తదితర దేశాలకు వెళ్లేందుకు నాలుగు నుంచి వారం రోజులకు రూ.40 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు వివిధ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. పర్యాటక సంస్థలు కొన్ని ప్యాకేజీలను ప్రచారం చేస్తుండడంతో విదేశీ ప్రయాణం చేయాలకునే వారికి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. విమాన టికెట్లు, త్రీస్టార్ హోటల్, ఎయిర్‌పోర్టు నుంచి పికప్, డ్రాప్, సైట్ సీయింగ్, గైడ్, వీసా, ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్ని ప్యాకేజీలు ఉండటం గమనార్హం. ప్యాకేజీ ధరలు ప్రయాణ తేదీలు, విమాన టికెట్లు, హోటల్ వసతి, భోజనం, వీసా ఇతర ఖర్చులపై ఆధారపడి మారుతుంటాయి.
ఒకవైపు సముద్రపు అలలు.. మరోవైపు ఆహ్లాదకరమైన బీచ్‌లు.. ఇంకోవైపు క్యాసినోల సందడి.. వెరసి బ్యాంకాక్, శ్రీలంక, వియత్నాం, ఇండోనేషియా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. ప్రకృతి అందాలు, సముద్రతీరాలు, నైట్ లైఫ్, వినోద కార్యక్రమాలతో ఆయా ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. శ్రీలంక, గోవాలో ఉండే క్యాసినోలో సభ్యత్వం తీసుకున్న వారు నెలకోసారి వెళ్లి వస్తున్నారు. అక్కడి నిర్వాహకులు ఎక్కుడ డబ్బులు చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారికి విమాన టికెట్లు, రూంలు ప్రత్యేకంగా బుక్ చేస్తుండడం విశేషం.
యాత్రల విషయంలో మారుతున్న ట్రెండ్


