కోకాపేట్, అమీన్‌పూర్, సూరారం, బాచుపల్లి తదితర చోట్ల .. నవంబర్ 12 నుంచి 27 వరకు బిడ్డింగ్ రూ.వెయ్యి కోట్ల ఆదాయం అంచనా
సాక్షి, సిటీబ్యూరో: హెచ్‌ఎండీఏ మరోసారి భూముల వేలానికి శ్రీకారం చుట్టింది. గతంలో బిడ్డింగ్ నిర్వహించిన ప్రాంతాల్లో మిగిలిన ప్లాట్‌లకు నవంబర్‌లో దశలవారీగా బిడ్డింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ వెలువరించింది. ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్‌లో కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్‌లోని ప్లాట్ నంబర్ 17లో ఉన్న 4.59 ఎకరాలకు ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. దాంతో ఆ బిడ్‌ను రద్దు చేశారు. తాజాగా మరోసారి నవంబర్ 27న బిడ్డింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్థలానికి ఎకరాకు రూ.120 కోట్ల చొప్పున కనీస ధరగా నిర్ణయించారు. నవంబర్ 18వ తేదీన ప్రీబిడ్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. గతంలో నియోపోలిస్ లే అవుట్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. గోల్డెన్ మైల్ సైట్–1లోని 0.70 ఎకరాల ప్లాట్‌కు ఎకరాకు రూ.70 కోట్లు కనీస ధరగా నిర్ణయించగా,బిడ్డింగ్‌లో ఎకరాకు రూ.115 కోట్లు లభించాయి. అలాగే అంతకంటే ముందు నియోపోలిస్‌లో ఎకరానికి కనీస ధర రూ.100 కోట్ల చొప్పున ప్రతిపాదించగా అనూహ్యంగా రూ.151.25 కోట్లకు అమ్ముడైంది. నవంబర్‌లో నిర్వహించనున్న బిడ్డింగ్‌లోనూ కోకాపేట్‌పైన అధికారులు మరోసారి పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు మూసాపేట్‌లోని 3.15 ఎకరాలకు కూడా ఈసారి బిడ్డింగ్ జరగనుంది. దీనికి ఎకరానికి రూ.99 కోట్ల చొప్పున కనీస ధర ఉంటుందని పేర్కొన్నారు. ఈ మొత్తం భూముల విక్రయాల ద్వారా రూ.1000 కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
అన్ని వర్గాలకు అందుబాటులో..
కోకాపేట్‌లోని హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో ఉన్న మరో 8,591 చ.గజాల స్థలానికి గజానికి రూ.1.50 లక్షల చొప్పున కనీస ధరను నిర్ణయించారు. రాయదుర్గంలోని 1,815 గజాల స్థలానికి రూ.1.75 లక్షలకు గజం చొప్పున, సూరారంలోని హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో ఉన్న 4,840 గజాల స్థలానికి రూ.55 వేలకు గజం చొప్పున కనీసధరలను నిర్ణయించారు. అలాగే కాప్రా, బాచుపల్లి, అమీన్‌పూర్ సర్వేనంబర్ 823, అమీన్‌పూర్ కిష్టారెడ్డిపేట్, ఇన్ముల్ నర్వ హుడాహైట్స్‌లోని ప్లాట్లకు కూడా బిడ్డింగ్ నిర్వహించనున్నారు.
మరోసారి హెచ్‌ఎండీఏ భూముల వేలం


