హుడాకాంప్లెక్స్: వృద్ధాశ్రమాల నిర్వహణలో స్వచ్ఛంద సేవా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి నారాయణమ్మ అన్నారు. సరూర్‌నగర్‌లోని మారుతీ వృద్ధాశ్రమంలో శనివా రం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఆశ్రమం నిర్వహణ బాగుందని తెలిపారు.
ప్రశాంతంగా అసిస్టెంట్
సైంటిస్ట్ పరీక్ష
మొయినాబాద్: అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్–2) పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు,మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు.సమయానికంటే గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల్లో 46.46 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. 665 మంది అభ్యర్థులకుగాను 309 మంది మాత్రమే పరీక్ష రాశారు, 356 మంది హాజరు కాలేదు. గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో 125 మందికి 65 మంది, చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో 120 మందికి 53, కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికి 80, జేబీఐఈటీ కళాశాలలో 120 మందికి 66, వీజేఐటీ కళాశాలలో 100 మందికి 45 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
విజయం సాధించేదాకా
విశ్రమించొద్దు
బడంగ్‌పేట్: విజయం సాధించే వరకు విశ్రమించొద్దని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి పోటీపరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు సూచించారు. బడంగ్‌పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠకులకు అందిస్తున్న సదుపాయాలు, నిర్వహణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీకి వచ్చిన పాఠకులతో మాట్లాడారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచాలని గ్రంథ పాలకులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పీజీవీ రాణి, గ్రంథాలయ సిబ్బంది ఉన్నారు.
పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించండి
మీర్‌పేట: అర్హులైన పట్టభద్రులంతా ఓటు హక్కు నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు అవగాహన కల్పించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి సూచించారు. మీర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఓటర్ల నమోదు అంశంపై శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి పెద్ద ఎత్తున పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయాలన్నారు.


