శంకర్పల్లి: ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘ టన పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని సింగాపురానికి చెందిన మొగులయ్య (48) ఆదివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై సంగారెడ్డి వైపు వెళ్తున్నాడు. బైక్ అదుపుతప్పి కింద పడింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం మొగులయ్యపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదంలో..
శంకర్పల్లి: ఓ ద్విచక్రవాహనదారుడు కింద పడి మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. మండలంలోని అలంఖాన్గూడకు చెందిన భుజంగారెడ్డి (55) ఆదివారం వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వస్తుండగా హుస్సేన్పూర్ వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైక్లు ఢీ: ఒకరి మృతి
చేవెళ్ల: రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ బైక్పై ఉన్న రైతు మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నాంచేరికి చెందిన ఆలూరి కిష్టయ్య(42) పాడిపశువుల నుంచి సేకరించిన పాలను ఆలూరులోని పాల కేంద్రానికి పోస్తుంటాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి పాలు తీసుకొని బైక్పై ఆలూరుకు వెళ్తున్నాడు. అదే సమయంలో ఆలూరు గ్రామానికి చెందిన బి.హరి మరో బైక్పై ఎదురుగా వచ్చాడు. రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కిష్టయ్యకు తీవ్ర గాయలు కావడంతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. హరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


