కందుకూరు: కారు అదుపు తప్పి దేవాలయం కోనేరులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న డ్రైవర్ తేరుకుని అద్దం తీసుకుని బయటికి రావడంతో ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మండలం కోనాపూర్‌కు చెందిన చెందిన బొడ్డుపల్లి కుమార్ (32) గ్రామంలో టీ దుకాణం నిర్వహిస్తూ వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం పని ముగించుకుని అర్ధరాత్రి సమయంలో కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. మార్గమధ్యలో మహేశ్వరం శివగంగ దేవాలయం వద్ద హైదరాబాద్ వైపు మళ్లాల్సి ఉండగా నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో కారు నేరుగా శివగంగ కోనేరులోకి బారికేడ్లను ధ్వంసం చేసుకుంటూ వెళ్లి నీటిలో మునిగింది. ఆ సమయంలో అప్రమత్తమైన కుమార్ అద్దం దింపి అందులో నుంచి బయటపడ్డాడు. ఓ వైపు ఆలయం, మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్ ఉన్నాయి. అదృష్టవశాత్తు ఆ రెండింటి మధ్య నుంచి దూసుకుపోవడంతో డ్రైవర్ ప్రాణాలతో బయపడ్డాడు. సోమవారం ఉదయం పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటికి తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రాణాపాయం నుంచి
బయటపడిన డ్రైవర్


